Share News

Where is the rice here! ఇక్కడి బియ్యం ఎక్కడెక్కడికో!

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:07 AM

Where is the rice here! డిపోల ద్వారా రేషన్‌ పంపిణీతో అక్రమాలకు చెక్‌ పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే తిరిగి డిపోల ద్వారా రేషన్‌ పంపిణీని ఇటీవలే ప్రారంభించింది. అంతలోనే క్షేత్రస్థాయిలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతూ విశాఖలో భారీగా దొరకడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Where is the rice here! ఇక్కడి బియ్యం ఎక్కడెక్కడికో!
విశాఖ జిల్లా శ్రీబాలాజీ రైస్‌ మిల్లులో రేషన్‌ బియ్యాన్ని పరిశీలిస్తున్న భీమిలి ఆర్డీవో, ఆనందపురం తహసీల్దారు శ్యాంప్రసాద్‌ తదితరులు(ఫైల్‌)

ఇక్కడి బియ్యం ఎక్కడెక్కడికో!

విశాఖ మిల్లుల్లోనూ మన రేషన్‌

నేరుగా గోదాముల నుంచి తరలింపు

జిల్లాలో ఎదురులేని బియ్యం మాఫియా!

అడ్డుకట్ట వేయలేకపోతున్న యంత్రాంగం

- ఈ నెల 6న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రెండు రైస్‌మిల్లులను అక్కడి అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. 82.4 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవి విజయనగరం పౌరసరఫరా శాఖ గోదాముల నుంచి వచ్చిన సరుకుగా నిర్థారించారు. బియ్యం సంచులపై ఉన్న లేబుళ్ల బట్టి అధికారులు ప్రకటించారు. గోదాముల నుంచి వచ్చిన బస్తాల సీల్‌ విప్పకుండానే తరలించినట్టు అధికారులు చెబుతున్నారు.

- ఈ నెల 5న బొండపల్లి మండలంలో టన్ను రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. విజయనగరంలోని గుంకలాం నుంచి గొట్లాం బైపాస్‌ రోడ్డుమీదుగా ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.50 వేల వరకూ ఉంటుందని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. బియ్యంతో పాటు ఆటోను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రాజాం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి):

డిపోల ద్వారా రేషన్‌ పంపిణీతో అక్రమాలకు చెక్‌ పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే తిరిగి డిపోల ద్వారా రేషన్‌ పంపిణీని ఇటీవలే ప్రారంభించింది. అంతలోనే క్షేత్రస్థాయిలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతూ విశాఖలో భారీగా దొరకడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పైగా నేరుగా గోదాముల నుంచి మిల్లులకు బియ్యం తరలిపోతుండడం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థలో నకిలీ మకిలీ ఇంకా పోలేదు. గతంలో డిప్యూటేషన్‌పై పనిచేసిన పౌరసరఫరాల అధికారిణిపై చాలా ఆరోపణలు వచ్చాయి. వాటిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి విచారణకు కూడా ఆదేశించారు.

జిల్లాలో రేషన్‌ బియ్యం దందాను నియంత్రిస్తున్నట్టు యంత్రాంగం చెబుతోంది కానీ కేసులు, పట్టుబడిన సరుకును చూస్తే అది ఒట్టి మాటగా తేలిపోతోంది. విజిలెన్స్‌ గణాంకాలను పరిశీలిస్తే నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 20 వరకూ కేసులు నమోదుచేసి 40 మంది వరకూ అరెస్టుచేశారు. రూ.46.38 లక్షల విలువైన 1,019.44 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్టు తేలింది. ఇప్పటికీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతోంది. బియ్యం మాఫియా ఆగడాలకు చెక్‌ పడడం లేదు. వైసీపీ హయాంలో రేషన్‌ బియ్యం దందా ఓ రేంజ్‌లో కొనసాగింది. ఇప్పటికీ మారలేదు. అప్పట్లో జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. జిల్లాలో ఓ 16 మంది వరకూ దళారులు ఉన్నట్టు అప్పట్లో ప్రచారం నడిచింది. వీరికి వైసీపీ పెద్దలు అండగా నిలిచేవారన్న విమర్శలున్నాయి. వీరంతా గ్రామాల్లో మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని బియ్యాన్ని సేకరించేవారు. ప్రతినెలా వేల క్వింటాళ్లు తరలించేవారని సమాచారం. అయితే ఇప్పటికీ బియ్యం దందా అలానే కొనసాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులున్నారు. 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి 35 కిలోల చొప్పున 1319.5 టన్నుల బియ్యం ఉచితంగా ఇస్తోంది. అయితే రేషన్‌కార్డుదారులు తీసుకుంటున్న వారిలో 25 శాతం మంది బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కిలో రూ.13 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు వాటిని రూ.20లకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. అయితే గతం మాదిరిగా కాకినాడ పోర్టుకు తరలించలేకపోతున్నారు. పోలీస్‌ నిఘా పెరగడంతో అక్రమార్కులు రూటుమార్చారు. అందుకే స్థానిక మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అటు మిల్లర్లు సైతం వాటినే లెవీగా చూపుతున్నారు.

వాటినే సన్నబియ్యంగానూ..

సాధారణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తుంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుంది. వారు ఏడాది పొడవునా మిల్లింగ్‌ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ఇందుకుగాను క్వింటా మిల్లింగ్‌ చేసినందుకు ప్రభుత్వం రూ.60 చెల్లిస్తుంది. అయితే ఇక్కడే కొందరు మిల్లర్లు దగా చేస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని నేరుగా లెవీగా చూపుతున్నారు. చిరు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేయించిన బియ్యాన్నే మిల్లింగ్‌ చేసిన బియ్యంగా చూపుతున్నారు. మరోవైపు రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా కొందరు మిల్లర్లు చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్‌ బియ్యాన్ని సాంబమసూరి వంటి బ్రాండెడ్‌ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. సన్నంగా మరపట్టడంతో వినియోగదారులు సైతం గుర్తించలేక మోసపోతున్నారు. ఇంత జరుగుతున్నా అటు వైపు పౌరసరఫరాల శాఖ అధికారులు కానీ.. తూనికలు కొలతలు శాఖ అధికారులు కానీ గమనించడం లేదు. దీంతో రోజురోజుకూ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి.

దృష్టిపెట్టాం..

విశాఖ జిల్లాలో మన జిల్లాకు చెందిన బియ్యం పట్టుబడడంపై దృష్టిపెట్టాం. ఇప్పటికే విజిలెన్స్‌ బృందాలు తిరుగుతున్నాయి. మొన్ననే బొండపల్లి మండలంలో బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వచేసినా నేరమే. మిల్లర్లు సైతం జాగ్రత్తగా ఉండాలి. నిల్వల్లో తేడావస్తే కఠిన చర్యలు తప్పవు. మరింత నిఘా పెంచుతాం. రేషన్‌ పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపడతాం.

- బి.శాంతి, జిల్లా పౌరసరఫరా అధికారి, విజయనగరం

Updated Date - Jun 13 , 2025 | 12:07 AM