పోస్టింగ్ ఎక్కడో?
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:04 AM
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో బదిలీలపై ఆందోళన నెలకొంది. పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో.. ఎంత దూరం వేస్తారోనని మథనపడుతున్నారు.
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన
- బదిలీపై దూరం వెళ్లాల్సి వస్తుందేమోనని బెంగ
- హేతుబద్ధీకరణలో సగానికి సగం తగ్గిన పోస్టులు
- సొంత మండలాల్లో అవకాశం శూన్యం
శృంగవరపుకోట, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో బదిలీలపై ఆందోళన నెలకొంది. పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో.. ఎంత దూరం వేస్తారోనని మథనపడుతున్నారు. హేతుబద్ధీకరణలో భాగంగా పోస్టులు సగానికి తగ్గిపోవడం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. మరోపక్క సొంత మండలాల్లో పోస్టింగ్‌కు అవకాశం లేకపోవడంతో వాఉ మరింత ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 626 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో 5,774 మంది ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్నారు. వాస్తవంగా అయితే 8,370 మంది పని చేయాలి. కానీ, వివిధ కారణాలతో చాలామంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేయడం, ఎంపికల సమయంలో అర్హత సాధించకపోవడం వంటి కారణాలతో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, హేతుబద్ధీకరణలో భాగంగా జిల్లాలోని 530 గ్రామ సచివాలయాల్లో 465 మంది డిజిటల్ అసిస్టెంట్లకు మాత్రమే బాధ్యతలు అప్పగిస్తున్నారు. 65 మంది డిజిటల్ అసిస్టెంట్లు మిగిలిపోతున్నారు. అదే విధంగా జిల్లాలోని 96 వార్డు సచివాలయాల్లోని 92 మంది అడ్మినిస్ర్టేటివ్ సెక్రటరీలకు పని అప్పగిస్తున్నారు. నలుగురు మిగులుతున్నారు. ఇదే మాదిరిగా ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న 5,774 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో 2,069 మంది మిగిలిపోనున్నారు. అయితే ప్రభుత్వం చూపించిన ఖాళీలను బట్టి ఆయా శాఖల ఉద్యోగులు బదిలీలను కోరుకోవాల్సి ఉంది. హేతుబద్ధీకరణలో భాగంగా పోస్టులు తగ్గిపోవడం, సొంత మండలంలో పని చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. బదిలీల్లో ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందోనని ఒకరు బెంగపడుతుంటే.. ఎక్కడా స్థానం దొరక్కుంటే పరిస్థితేంటని మరొకరు మదనపడుతున్నారు.
ఐదేళ్లు పూర్తయిన వారు కదలాల్సిందే..
ఐదేళ్లు సర్వీస్ పూర్తయిన వారంతా పాత స్థానాల నుంచి కదలాల్సిందే. రెండేళ్లు పూర్తయిన వారికి వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేయనున్నారు. ఈ నెల 30లోపు ఈ పక్రియను పూర్తిచేయాల్సి ఉంది. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారి వివరాలను ఆయా శాఖల వద్ద ఉన్నాయి. బదిలీల అభ్యర్థనను ఆన్‌లైన్‌లో ప్రాథమికంగా తీసుకుంటున్నారు. డిక్లరేషన్‌తో పాటు స్టడీ, ఉద్యోగి వివరాలు, ఆధార్, స్పౌస్ ఆధార్‌ను కూడా కొన్ని శాఖలు అడుగుతున్నాయి. ప్రస్తుతం బదిలీలకు అవకాశం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారంతా ఐదేళ్లు పూర్తిచేసుకున్నవారే. బదిలీలకు ప్రభుత్వం సూచించిన ప్రాధాన్యాల తరువాత మిగిలిన ఉద్యోగుల బదిలీలకు ఏఏ ప్రాధాన్యాంశాలు తీసుకుంటారన్న స్పష్టత లేదు. డీఎస్సీలో సాధించిన ర్యాంకు ఆధారంగా బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారని కొంత మంది అంటే, వయసును బట్టి ప్రాధాన్యత ఇస్తారని మరి కొందరి నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.
కుటుంబాన్ని నెట్టుకురావడమెలా?
సచివాలయ ఉద్యోగులకు జీతాలు తక్కువ. అన్ని కటింగ్‌లు పోను చేతికి రూ.30వేల వరకు అందుతున్నాయి. వీటితోనే కుటుంబాన్ని నెట్టుకురావాలి. ఇంతవరకు సొంత మండల పరిధిలో చేసినందున ఇళ్ల నుంచి సచివాలయాలకు రాకపోకలు సాగించారు. ఇప్పుడు సొంత మండల పరిధిలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. వేరే మండలానికి వెళ్లాలి. అదేంత దూరం ఉంటుందో అంచనా కూడా ఉద్యోగులు వేయలేకపోతున్నారు. 30 కిలోమీటర్లు దాటిఉన్న సచివాలయాలకు వెళ్లాల్సి వస్తే ఇంటి అద్దె, ఇతర రవాణా ఖర్చులకు జీతంలో రూ.10వేల వరకు పోతాయని బాధపడుతున్నారు. ప్రభుత్వం వార్డు సచివాలయాల ఉద్యోగులకు మాత్రం వెసులుబాటు ఇచ్చింది. సొంత వార్డు తప్ప మిగిలిన ఏ వార్డు సచివాలయానికైనా బదిలీపై వెళ్లవచ్చని చెప్పింది. ఇదిలా ఉంటే కోరుకున్న స్థానం పొందేందుకు సచివాలయ ఉద్యోగులు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి నుంచి సిఫారసు లేఖలు పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు.