Share News

ప్లాస్టిక్‌ నిషేధం ఎక్కడ?

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:42 AM

విజయనగరంలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి.

ప్లాస్టిక్‌ నిషేధం ఎక్కడ?
కేఎల్‌పురంలోని ఓ దుకాణంలో వినియోగిస్తున్న పాలిథిన్‌ కవరు

- నగరంలో విచ్చలవిడిగా విక్రయం

- యథేచ్ఛగా వినియోగం

- తూతూ మంత్రంగా అధికారుల దాడులు

విజయనగరం టౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. అన్ని దుకాణాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా.. పర్యావరణం దెబ్బతింటుందని తెలిసినా ప్రజలు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీనివల్ల కేన్సర్‌ వంటి వ్యాధుల బారినపడుతున్నారు. 40మైక్రాన్లు కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ వినియోగం పూర్తిగా నిషేధం. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రంగా పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ప్లాస్టిక్‌ విక్రయాలపై తూతూ మంత్రంగా దాడులు జరిపి ర్యాంకులు కోసం ఆరాటపడుతున్నారే తప్పా పూర్తిస్థాయి నియంత్రణలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా నగరంలోని కిళ్లీ బడ్డీలు, పండ్లు, కూరగాయలు, టిఫిన్‌, హోటళ్లు ఇలా అన్ని దుకాణాల్లో ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువైంది. దీంతో పట్టణంలో ఎక్కడిపడితే అక్కడే పాలిథిన్‌ సంచులు కనిపిస్తున్నాయి. నగర వీధులు, మురికి కాలువలు పాస్లిక్‌ కూపాలుగా మారుతున్నాయి. నేల సైతం కలుషితమవుతోంది. పర్యావరణం దెబ్బతింటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాస్టిక్‌ విక్రయాలను పూర్తిగా నిరోదించాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ విషయమై విజయనగరం కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ అధికారి కొండపల్లి సాంబశివరావును వివరణ కోరగా.. ‘నగరంలో ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిన మాట వాస్తవమే. ఇక నుంచి దాడులు ముమ్మరం చేస్తాం. దీనికి సంభందించి ఇప్పటికే పారిశుధ్య సిబ్బందికి అవగాహన కల్పించాం. ప్లాస్టిక్‌ను వినియోగించినా, అమ్మకాలు సాగించినా ఉపేక్షించేది లేదు.’ అని అన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:42 AM