Where is the file? ఫైల్ ఎక్కడుందో?
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:55 PM
Where is the file?ఊరు.. పొలం తప్ప మరో ప్రాంతం తెలియని రైతు సమస్య చెప్పుకుందామని మండల అధికారి వద్దకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తాడు. ఎలా మాట్లాడాలో.. సమస్యను ఎలా చెప్పాలోనని కంగారుపడతాడు. ఎవరో ఒకరు తోడు ఉంటేనే ఆ మాత్రం ధైర్యం చేయగలుగుతాడు. అలాంటిది మండల ఆఫీసులు, జిల్లా కార్యాలయాలు, సెక్షన్‌లు, వాటిని చూసే ఉద్యోగులు, అధికారుల వద్దకు వెళ్లాలంటే ఎంత కష్టపడాలి? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తుంది. కానీ చాలా మంది జిల్లా రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ అవస్థలు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగివేసారిపోతున్నారు.
ఫైల్ ఎక్కడుందో?
అయోమయంలో పేద రైతులు
భూమి అమ్మాలంటే నరకయాతనే
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
కనికరించని యంత్రాంగం
ఊరు.. పొలం తప్ప మరో ప్రాంతం తెలియని రైతు సమస్య చెప్పుకుందామని మండల అధికారి వద్దకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తాడు. ఎలా మాట్లాడాలో.. సమస్యను ఎలా చెప్పాలోనని కంగారుపడతాడు. ఎవరో ఒకరు తోడు ఉంటేనే ఆ మాత్రం ధైర్యం చేయగలుగుతాడు. అలాంటిది మండల ఆఫీసులు, జిల్లా కార్యాలయాలు, సెక్షన్‌లు, వాటిని చూసే ఉద్యోగులు, అధికారుల వద్దకు వెళ్లాలంటే ఎంత కష్టపడాలి? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తుంది. కానీ చాలా మంది జిల్లా రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ అవస్థలు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగివేసారిపోతున్నారు.
శృంగవరపుకోట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి):
- జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు నుంచి మరో రైతు దాదాపు 70 సెంట్ల వరకు భూమిని కొనుగోలు చేశాడు. మూడు సర్వే నెంబర్‌లలో ఉన్న ఆ భూమికి రీ సర్వే సమయంలో ఒక సర్వే నెంబర్‌ను తప్పించి రెండు సర్వే నెంబర్‌లను కలిపి ఎల్‌పీఎం నెంబర్ ఇచ్చారు. కొనుగోలు చేసిన రైతు ఈ భూమిని అమ్మకానికి పెట్టారు. డాక్యుమెంటుకు, ఎల్‌పీఎం నెంబర్‌లో ఉన్న సర్వే నెంబర్‌కు మధ్య వ్యత్యాసం ఉండడంతో భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అభ్యంతం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులో సరిచేసుకోవాలని సూచించారు. దీంతో ఆ రైతు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. దాదాపు రెండు, మూడు వారాల పాటు తిప్పించుకున్న మండల అధికారులు డివిజనల్ రెవెన్యూ అధికారికి పంపించారు. అక్కడ రెండు వారాలు తిరిగాక ఓ జిల్లా స్థాయి అధికారి లాగిన్‌లో ఉందని వారం రోజులుగా చెబుతున్నారు. ఎప్పటికి పనవుతుందో తెలియక రైతు అల్లాడుతున్నాడు. భూమి అమ్మకానికి అడ్వాన్స్ తీసుకున్న వ్యక్తి నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.
రెవెన్యూలోని పారదర్శకతకు ఉదాహరణిది. ఇలా రైతులు రీసర్వే సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతు వెళ్లి కలిస్తే తప్ప ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు కదలడం లేదు. ఏ స్థాయిలో ఎవరి దగ్గర ఫైలు ఉందో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లాలో సన్న, చిన్నకారులు రైతులు ఎక్కువ. వీరు వ్యవసాయంపై వచ్చే ఆదాయం సరిపోక కుటుంబ జీవనాఽధారం కోసం వివిధ రకాల కూలిపనులకు వెళ్తుంటారు. గ్రామం తప్ప మండల అధికారుల వద్దకు వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఈ పరిస్థితిలో రైతు మండల ఆఫీసులు, జిల్లా కార్యాలయాలు, సెక్షన్‌లు, వాటిని చూసే ఉద్యోగులు, అధికారుల వద్దకు వెళ్లాలంటే ఎంత కష్టపడాలి? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తుంది. కానీ చాలా మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ అవస్థలు పడుతున్నారు. విసిగివేసారిపోతున్నారు. ఈ-ఫైలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా పలానా సెక్షన్ నుంచి ఇప్పటివరకు ఫైలు రాలేదని చెబుతుండడంతో అది ఏ సెక్షనో, ఆ అధికారి పేరేంటో, ఎవరిని కలవాలో తెలియక ఉదయం వచ్చిన రైతు సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా తిరగాల్సి వస్తోంది.
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములను రీసర్వే చేయించారు. దశాబ్దాల క్రితం చైన్, మాన్యూవల్ విధానంలో భూమి కొలతలు కొలిచారు. ప్రస్తుతం ఆధునిక డిజిటల్ సర్వే ద్వారా భూమి కొలత చేపడుతున్నారు. దీంతో పాత కొలతలకు, ప్రస్తుత కొలతలకు మధ్య 5శాతం విస్తీర్ణం తేడా అనుమతించారు. దీనివల్ల ఆర్‌ఓఆర్ (1బి)లో వున్న విస్తీర్ణానికి.. వాస్తవ విస్తీర్ణానికి మధ్య సరిపోలడం లేదు. భూ కొలతల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఓ సర్వే నెంబర్‌లో వున్న భూమినంతటికీ ఒకే ఎల్‌పీఎం నెంబర్ ఇచ్చేశారు. ఇదే సర్వే నెంబర్‌లో అనేక మంది రైతులు ఉంటున్నారు. వారిలో ఎవరైనా భూమిని విక్రయించాలనుకుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- కూటమి ప్రభుత్వం ఈ సర్వే సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలను నిర్వహించింది. ఈ గ్రామ సభల ద్వారానే 23,113 దరఖాస్థులను అధికారులు స్వీరించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్, ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లకు లెక్కకు మించి విన్నపాలు వస్తున్నాయంటే రీసర్వే సమస్యలతో రైతులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రీసర్వేను రెవెన్యూ, సర్వే శాఖ నిర్వహించాయి. ఇవే శాఖల అధికారులు రీసర్వేలో చేసిన తప్పులకు ఇప్పుడు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. అవసరానికి భూమిని అమ్ముకోలేకపోతున్నారు. చిన్నచిన్న తప్పులను సరిచేసుకొనేందుకు రెవెన్యూ, సర్వే అధికారులతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చేయి తడపాల్సి వస్తోంది. అయినప్పటికీ సమయానికి పనికావడం లేదు. ప్రతి కలెక్టరేట్‌లోనూ స్పెషల్ రెవెన్యూ డెస్కు ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ తీసుకున్న నిర్ణయంతోనైనా రైతులకు అవస్థలు తప్పుతాయేమో చూడాలి.
----------------