terrorism: ఉగ్ర శిక్షణ ఎక్కడ పొందారు?
ABN , Publish Date - May 25 , 2025 | 11:59 PM
terrorism: విజయనగరంలో ఉగ్ర మూలాలపై ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు విచారణ వేగవంతం చేశారు.
- ఏయే రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర చేశారు
- ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్, సమీర్‌పై ప్రశ్నల వర్షం
- విచారణ వేగవంతం చేసిన ఎన్‌ఐఏ, ఏటీఎస్
- మూడోరోజు 10 గంటలపాటు కొన సాగిన విచారణ
విజయనగరం/క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో ఉగ్ర మూలాలపై ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మన్, సయ్యద్ సమీర్‌ను మూడోరోజు ఆదివారం ఎన్‌ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), స్థానిక పోలీసు అధికారులు విచారించారు. విజయనగరం పోలీసు శిక్షణ కేంద్రంలో వారిని 10 గంటల పాటు విచారణ చేపట్టారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉగ్రవాద విదేశీ లింకులు, ఏయే రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర చేశారు, ఆర్థిక లావాదేవీలు, సహాయ, సహకారాలు అందించిన వారి వివరాలు గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఫేక్, ఒరిజనల్ ఖాతాలు, కాల్‌డేటా, ఇంటర్నెట్ కాల్స్‌పై ఆరా తీశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన నిధులు, అవి ఏయే బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లాయి వంటి విషయాలపై బ్యాంక్ అధికారులతో కూడా చర్చించినట్లు తెలిసింది. అయితే, విచారణలో సిరాజ్, సమీర్ చాలావరకు నోరుమెదపడం లేదని తెలుస్తుంది.
అనేక ప్రశ్నలకు ‘మాకు సంబంధం లేదని’ చెబుతున్నట్లు తెలిసింది. అధికారులు మాత్రం వారి వద్దనున్న పక్కా సమాచారంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం సుమారు 10 గంటల పాటు సిరాజ్, సమీర్‌ను విచారించారు. విచారణ పూర్తయిన తరువాత సిరాజ్, సమీర్‌కు రుచి, శుచికరమైన భోజనాలు అందించారు. వారిద్దరికి ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా ప్రభుత్వ డాక్టర్లతో వైద్యం అందిస్తున్నారు. ఈ విచారణలో ఎన్‌ఐఏ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్సీ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అధికారులు పాల్గొన్నారు.
విచారణలో ఏమి అడిగారంటే..
- ఉగ్రవాదం వైపు ఎందుకు వెళ్లవలసి వచ్చింది. ఎవరి ప్రేరణతో విధ్వంసం చేయాలనుకున్నారు. ఉగ్రవాద సంస్థల ప్రతినిధుల్లో ఎవరిని కలిశారు. ముఖ్యంగా ఉగ్ర శిక్షణ ఎక్కడ?. ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారు వంటి విషయాలపై అధికారులు ప్రశ్నించారు. అధికారులు ఎంత ఓపికగా అడిగినా సిరాజ్, సమీర్ నోరు విప్పడం లేదు. వారి మొండితనంతో అధికారులకు విసుగుపుట్టిస్తున్నట్లు తెలిసింది.
- ఎన్‌ఐఏతో పాటు తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్సీ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అధికారులు వారికున్న అనుభవంతో ఎవిడెన్స్ సంపాదించుకుని, పూర్తి సమాచారం ముందస్తుగా సేకరించి సిరాజ్, సమీర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటిలో కొన్నింటికి వారు ‘నో’ అనే సమాధానం చెబుతున్నట్లు తెలిసింది.
- హైదరాబాద్‌లో ఉంటున్న సమయంలో సమీర్‌ను కాకుండా ఇతర ప్రాంతాల్లో కొందరిని కలిసినట్లు మాకు సమాచారం ఉంది. వారు ఎవరు, ఎందుకు కలవాల్సి వచ్చింది. వారి పేర్లేంటి? ఎక్కడ ఉంటారు. అని సిరాజ్‌ను ప్రశ్నించారు. ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్‌లో మీ ఇద్దరు రెక్కీచేసిన ప్రాంతాలు ఏంటి.? ఎందుకు రెక్కీ నిర్వహించారనే కోణంలో విచారణ కొనసాగింది.
-ఇసార్ అహ్మద్, జాకీర్ నాయిక్, షేక్ యాకూబ్, జాంఆలీ, షేక్ జావిద్ రబ్బానితో కలిసి సిరాజ్, సమీర్ మరింత ఉగ్రవాద, మతోన్మాదం వైపు మొగ్గుచూపి పేలుళ్లకు కుట్ర పన్నినట్లు దర్యాప్తు అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరిపినట్లు తెలిసింది.
- ఆహీం సంస్థను ఏర్పాటు చేసి యువతను మతోన్మాదంపై ఆకర్షించేలా చేయడం, ఉగ్రవాద కార్యకలాపాలను పలు రాష్ట్రాలకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందించడం వంటివి చేసినట్లు అధికారుల విచారణలో తేలినట్లు తెలిసింది.
-ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్, వరంగల్‌కు చెందిన పరహాన్ మోహీద్దీన్‌తో ఎటువంటి ప్రణాళిక రూపొందించారు. ప్రణాళికలో భాగంగా ఇతర మతాల వారిని ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. దేశంలో ఏయే రాష్ట్రాలో రెక్కీలు నిర్వహించారని ప్రశ్నించారు.