Boat Safari? బోటు షికారు ఎప్పుడు?
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:57 PM
When’s the Boat Safari? తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో బోటు షికారుకు మోక్షమెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. పిక్నిక్‌ల సీజన్ కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు బోటు షికారు చేయలేక వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతంలో గుర్రపు డెక్క కొంతమేర ఒడ్డుకు చేరుకుంది. దానిని తొలగించడంపై అధికారులు దృష్టిసారించడం లేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరాశలో పర్యాటకులు
గరుగుబిల్లి, నవంబరు16(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలో బోటు షికారుకు మోక్షమెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. పిక్నిక్‌ల సీజన్ కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు బోటు షికారు చేయలేక వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతంలో గుర్రపు డెక్క కొంతమేర ఒడ్డుకు చేరుకుంది. దానిని తొలగించడంపై అధికారులు దృష్టిసారించడం లేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా గతంలో బోటు షికారు నిర్వహించినా గుర్రపు డెక్క కారణంగా పలు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తాటిపూడి ప్రాజెక్టుకు ఇక్కడి బోట్లును తరలించారు. ప్రస్తుతం రెండు బోట్లు తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని గుర్రపు డెక్క నడుమ చిక్కుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై పార్వతీపురం ఐటీడీఏ జేఈ తిరుపతిరావును వివరణ కోరగా.. ‘ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో బోటు షికారు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు రెండు బోట్లు, జట్టీలకు మరమ్మతులు చేయిస్తాం. తాటిపూడి తరలించిన మూడు బోట్లును తిరిగి రప్పిస్తాం. కుడి మట్టికట్ట ప్రాంతంలో నదీ ప్రాంతాన్ని వీక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు.