ఇంకెప్పుడిస్తారో?
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:54 PM
పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని 28 గిరిజన ఉపప్రణాళిక మండలాల్లోని గిరిజన రైతులకు గత ఐదేళ్లుగా రాయితీపై హార్టికల్చర్, అగ్రికల్చర్ యంత్రాలు, పరికరాలు అందడం లేదు.
-గిరిజన రైతులకు అందని రాయితీ వ్యవసాయ పరికరాలు
- ఐదేళ్లుగా ఎదురుచూపు
- ఐటీడీఏకు దరఖాస్తుల వెల్లువ
సీతంపేట రూరల్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని 28 గిరిజన ఉపప్రణాళిక మండలాల్లోని గిరిజన రైతులకు గత ఐదేళ్లుగా రాయితీపై హార్టికల్చర్, అగ్రికల్చర్ యంత్రాలు, పరికరాలు అందడం లేదు. దీంతో వారు ఆధునిక వ్యవసాయ పద్ధతులకు దూరమవుతున్నారు. గిరిజన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం 2019-20ఏడాదిలో ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ (కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కాంపొనెంట్ నిధులు) కింద పార్వతీపురం ఐటీడీఏకు రూ.2.3కోట్లు, సీతంపేట ఐటీడీఏకు రూ.2.60కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులతో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, పవర్‌టిల్లర్లు, వీడర్లు, టార్పలిన్‌లు వంటి వ్యవసాయ యంత్ర, పరికరాలను 90శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు అందించాల్సి ఉంది. కానీ, ఈ నిధులు వినియోగించకపోవడంతో ఐటీడీఏల ఖజానాల్లోనే అవి మూలుగుతున్నాయి. నిధులు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని ఐటీడీఏ అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఎందుకిలా?
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 వరకూ గిరిజన రైతులకు సకాలంలో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు 90శాతం రాయితీపై అందేవి. వీటిని వినియోగించుకొని గిరిజనులు ఖరీఫ్, రబీ సీజన్లలో ఆధునిక సాగు చేసి ఆర్థికంగా లాభపడేవారు. అయితే, 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం రాయితీ యంత్రాల పంపిణీపై నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ నిధులను ఐటీడీఏల ద్వారా ఖర్చు చేయకుండా, సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానాన్ని కూడా జగన్ ప్రభుత్వం అమలు చేయలేక చేతులెత్తేసింది. దీంతో రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏల్లో ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ నిధులు నేటికీ మూలుగుతూనే ఉన్నాయి. రాయితీ వ్యవసాయ పరికరాల కోసం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజన రైతులు వినతులు అందిస్తున్నారు. ఇప్పటికే 200యూనిట్లకు గాను వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదు.
ఎన్నాళ్లిలా?
గిరిజన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక ఉప ప్రణాళిక నిధులను ఖర్చు చేయకుండా ఎన్నాళ్లిలా కాలయాపన చేస్తారని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానం ద్వారా గానీ, లేదా ఆయా ఐటీడీఏల పరిధిలోని గిరిజన రైతుల రిక్వయిర్‌మెంట్(డిమాండ్) మేరకు గానీ హార్టికల్చర్, అగ్రికల్చర్ పరికరాలను కొనుగోలు చేసి సబ్సిడీపై వారికి అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ నిధులను రైతుల కోసం వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
వ్యవసాయ పరికరాల కోసం గిరిజన రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగానే ఉంది. వీటికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే హార్టికల్చర్, అగ్రికల్చర్ పరికరాలను రైతులకు రాయితీపై పంపిణీ చేస్తాం.
-ఆర్‌వీ గణేష్, హార్టికల్చర్ ప్రాజెక్ట్ అధికారి