ఎప్పుడిస్తారో?
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:09 AM
జిల్లాలో పల్లె పండగ పేరిట చేపట్టిన వివిధ పనులకు సంబంధించి బిల్లులు అందడం లేదు. ఐదు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు.

-‘పల్లె పండగ’ బిల్లుల కోసం ఎదురుచూపు
- రూ.109కోట్లు పెండింగ్
- రూ.67 కోట్ల ‘ఉపాధి’ బిల్లులు కూడా..
విజయనగరం కలెక్టరేట్ ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పల్లె పండగ పేరిట చేపట్టిన వివిధ పనులకు సంబంధించి బిల్లులు అందడం లేదు. ఐదు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. మొత్తం రూ.109కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అదే విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి వేతనదారులకు పది వారాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి రూ.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో బిల్లులు ఎప్పుడిస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె పండగ కార్యక్రమం పేరిట గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, బీటీ రహదారులు, సోప్ పిట్స్ వంటి పనులకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 4,347 పనులకు గాను రూ.438 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకూ 2,808 పనులు పూర్తి చేసినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈ పనులకు సంబంధించి గత ఏడాది డిసెంబరు 13 వరకు రూ.84 కోట్లు బిల్లులు మంజూరు చేశారు. తరువాత చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. రూ.109 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినట్లు అధికార గణంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు ఐదు నెలల నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో మిగిలిన పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. జిల్లా వ్యాప్తంగా 1,012 గోకులాలు మంజూరు కాగా, 932 నిర్మాణాలు పూర్తయ్యాయి. రైతులు ముందుగా పెట్టుబడి పెట్టి వీటిని నిర్మించారు. ప్రతి రైతు రూ.లక్ష నుంచి రూ.1.80లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వీరికి డిసెంబరు నెల నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం వేతనదారులు కూడా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. వేతనదారులకు గత జనవరి 16 నుంచి చేపట్టిన పనులకు సంబంధించి రూ.67 కోట్లు బిల్లులు మంజూరు కావల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
నిధులు మంజూరైన వెంటనే చెల్లిస్తాం
జిల్లా వ్యాప్తంగా మెటీరియల్ వర్కులకు సంబంధించి రూ.109 కోట్లు నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఉపాధి హామీ వేతనదారులకు రూ.67 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిఽధులు మంజూరైన వెంటనే చెల్లిస్తాం.
శారదాదేవి, డ్వామా పీడీ, విజయనగరం