యూరియా వచ్చేదెప్పుడు?
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:44 PM
అదును దాటిపోతున్నా జిల్లాకు ఇంకా పూర్తిస్థాయిలో యూరియా సరఫరా కాలేదు.
- జిల్లాలో తీవ్ర కొరత
- ఇంతవరకు 14,481 టన్నులే సరఫరా
- ఇంకా 7వేల టన్నులు అవసరం
- ఇబ్బందులు పడుతున్న రైతులు
- ఆ మూడు దుకాణాల్లో అమ్మకాలకు బ్రేక్
పార్వతీపురం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): అదును దాటిపోతున్నా జిల్లాకు ఇంకా పూర్తిస్థాయిలో యూరియా సరఫరా కాలేదు. ఇంకా ఏడువేల టన్నుల యూరియా కొరత ఉంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే), సహకార సంఘాల ద్వారా యూరియాను అరకొరగా సరఫరా చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులు కొంటనే యూరియా ఇస్తామని షరతు పెడుతున్నారు. మరికొందరు వ్యాపారులు రసాయన యూరియా లేదని చెప్పి నానో యూరియాను అంటగడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
అవసరం కొండంత...సరఫరా గోరింత
ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 21,483 టన్నుల యూరియా అవసరం. కానీ, ఇప్పటివరకు కేవలం 14,481 టన్నులు మాత్రమే సరఫరా అయింది. మార్క్‌ఫెడ్ ద్వారా 7,260 టన్నులు రైతు సేవా కేంద్రాలకు, 7221 టన్నులు ప్రైవేటు డీలర్లకు సరఫరా జరిగింది. ఇంకా 7002 టన్నులు జిల్లాకు రావాల్సి ఉంది. యూరియా కొరతతో రైతులకు పూర్తిస్థాయిలో దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆర్‌ఎస్‌కేల్లో ఎరువులను అందించకపోవడంతో రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. యూరియా కావాలంటే.. జింక్, దుబ్బు గుళికలు, పోటాస్ తదితర కాంప్లెక్స్ ఎరువులను కొనాల్సిందేనని షరతులు పెడుతున్నారు. పైగా వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతుసేవా కేంద్రాల్లో 45 కిలోల యూరియా బస్తా రూ.275కు అందించారు. అదే యూరియా బస్తాను ప్రైవేట్ వ్యాపారులు రూ.350 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారు. దీంతో కొనుగోలు చేసేందుకు కొందరు రైతులు జంకుతుంటే.. మరికొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధర వెచ్చించి యూరియాను తీసుకెళ్తున్నారు.
ఆ దుకాణాల్లో ఎరువులు వి క్రయాలు స్టాప్..
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా చాలామంది దుకాణాల యజమానులు పట్టించుకోవడం లేదు. అధిక ధరలకు యూరియాను విక్రయించడంతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో సుమారు వంద ఎరువులు దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. సీతానగరంలోని ఒక దుకాణంలో 8 టన్నులు, వీరఘట్టంలోని ఓ దుకాణంలో 37 టన్నులు, పాచిపెంటలోని ఒక షాపులో 10 టన్నుల ఎరువులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. నిల్వలు, రికార్డుల్లో తేడాలు ఉండడంతో ఈ మూడు దుకాణాల్లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎరువులు విక్రయించవద్దని అధికారులు ఆదేశించారు.
యూరియా కొరత లేకుండా చర్యలు
దుకాణాల్లో అధిక ధరలకు యూరియా విక్రయించినా, యూరియాతో పాటు ఏమైనా కొనుగోలు చేయాలని నిబంధనలు పెట్టినా చర్యలు తప్పవు. మూడు దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించిన మాట వాస్తవమే. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయాధికారి, పార్వతీపురం