Sachivalayam సచివాలయాలకు ... ఎప్పుడొస్తారో?
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:22 AM
When Will They Return to the Secretariats? గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ద్వారా ప్రజ లకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. అనేకచోట్ల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడు విధులకు హాజరవుతున్నారో.. ఎప్పుడు బయటకు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. కొన్ని సచివాలయాల్లో అరకొరగానే ఉద్యోగులు కనిపిస్తున్నారు.
లేఖ ఇవ్వకుండానే విధులకు డుమ్మా
సర్వేలంటూ ఇంకొందరు బయటకు..
తిరిగి ఎప్పుడొస్తారో తెలియని వైనం
వెలవెలబోతున్న కార్యాలయాలు
సిబ్బందిలో కొందరు బిజీ.. మరికొందరు ఖాళీ
స్పష్టంగా కనిపించిన పర్యవేక్షణ లోపం
ప్రజలకు పూర్తిస్థాయిలో అందని సేవలు
పార్వతీపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటి ద్వారా ప్రజ లకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. అనేకచోట్ల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడు విధులకు హాజరవుతున్నారో.. ఎప్పుడు బయటకు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. కొన్ని సచివాలయాల్లో అరకొరగానే ఉద్యోగులు కనిపిస్తున్నారు. కొంతమంది సెలవు లేఖ ఇవ్వ కుండా డుమ్మా కొడుతున్నారు. అనేక సచివాలయాల్లో ఒకరిద్దరు ఉద్యోగులే దర్శనమిస్తున్నారు. దీంతో వివిధ పనులపై వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తంగా జిల్లాలోని సచి వాలయ వ్యవస్థపై పర్యవేక్షణ కొరవడింది. సోమవారం జిల్లాలోని పలు సచివాలయాలను ‘ఆంధ్ర జ్యోతి’ విజిట్ చేసింది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం కొంతమంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో బిజీగా ఉండగా, మరికొంతమంది ఖాళీగా ఉండడం కనిపించింది.
గ్రేడ్‌లుగా విభజన
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 312, పట్టణాల పరిధిలో 38 సచివాలయాలు ఉన్నాయి. 2,500 లోపు ప్రజలు ఉన్న సచివాయాలను ఏ గ్రేడ్‌గా, 2,501 నుంచి 3,500 జనాభా ఉన్న సచివాల యాలను బీ గ్రేడ్‌గా, 3,501 మించి జనాభా ఉన్న సచివాలయాలను సీ-గ్రేడ్‌గా విభజించారు. ఏ-బీ గ్రేడ్‌లో 137, సీ గ్రేడ్‌లో 70 సచివాలయాలు ఉన్నాయి.
గతంలో నియామకం ఇలా..
గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలోని అన్ని సచివాలయాల్లో సుమారు పది నుంచి 11 మంది ఉద్యోగులను నియమించింది. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురుకు మినహా మిగిలిన వారికి ఏ పనీ లేని పరిస్థితి. గతంలో వలంటీర్లు అన్నీతామై వ్యవహరించేవారు. దీనివల్ల కొంతమంది ఉద్యోగులకు తమ విధులేమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతో మంది సచివాలయాల్లో ఉద్యోగులుగా చేరినప్పటికీ వారికి అవసరమైన పని లేదని చెప్పొచ్చు.
కూటమి చర్యలు ..
- సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పూరిస్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రక్షాళనలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఇటీవల రీ గ్రూపింగ్ చేపట్టిన తర్వాత కొన్ని సచివాయాలకు కొంతమంది సిబ్బంది అవసరం లేదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
- జిల్లాలోని 15 మండలాల్లో 312 గ్రామ సచివాలయాలున్నాయి. మొత్తంగా 4,056 పోస్టులు మంజూరు చేయగా.. ప్రస్తుతం 3,067 మంది పనిచేస్తున్నారు. ఇందులో 2,532 మంది ఉద్యోగులు అవసరం కాగా.. మరో 1,724 మంది అదనంగా ఉన్నారని గుర్తించారు.
- 62 సచివాలయాల్లో డిజటల్ అసిస్టెంట్లు, మరో 79 సచివాలయాల్లో కార్యదర్శులు, 40 చోట్ల ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, మరో 218 సచివాలయాల్లో మహిళా పోలీసులు, 141 సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు , 157 సచివాలయాలల్లో వీఆర్‌వోలు, మరో 155 సచివాలయాల్లో గ్రామ సర్వేయర్లు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది.
- 157 సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు, 295 చోట్ల మత్స్య శాఖ అసిస్టెంట్లు, 266 సచివాలయాల్లో ఉద్యానశాఖ, 83 చోట్ల అగ్రికల్చర్ , మరో 71 సచివాలయాల్లో పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్లు అవసరం లేదని గుర్తించారు.
- పట్టణాలకు సంబంధించి 21 సచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు, 20 చోట్ల ఎనర్జీ అసిస్టెంట్లు, 16 సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అవసరం లేదని గుర్తించారు. వారితో పాటు మరికొంతమంది ఉద్యోగులను అవసరమైన చోటకు బదిలీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
పలుచోట్ల ఇలా ..
- పాలకొండ: స్థానిక ఇందిరానగర్‌కాలనీలోని సచివాలయాన్ని సోమవారం ఉదయం 10:30 గంటలకు పరిశీలించగా ఐదుగురు మాత్రమే కనిపించారు. ఇక్కడ పది మంది పనిచేయాల్సి ఉంది. అయితే వీఆర్వో , ప్లానింగ్ సెక్రటరీలు డెప్యుటేషన్‌పై వెళ్లారు. మిగతా ఎనిమిది మందిలో ఐదుగురు విధుల్లో ఉండగా.. ముగ్గురు ఎన్‌ఎంలు అర్బన్ సెంటర్లకు వెళ్లినట్లు అడ్మిన్ శ్రీనివాసరావు తెలిపారు.
- మక్కువ రూరల్: మక్కువలోని రెండు సచివాలయాలను సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో సందర్శించగా సిబ్బంది కనిపించలేదు. సచివాలయం-1లో మొత్తం 11మంది పనిచేయాల్సి ఉండగా మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనిమిది మంది సిబ్బందిలో వీఆర్‌వో మాత్రమే సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఏడుగురు ఉద్యోగులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నది తెలియరాలేదు. సచివాలయం-2లో వెల్ఫేర్ అసిస్టెంట్ మాత్రమే కనిపిం చారు. ఇక్కడ పది మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో ఐదుగురు ఉగ్యోగులు ఎక్కడకెళ్లారో తెలియలేదు. మొత్తంగా రెండు సచివాలయాల్లో వీఆర్వో, వెల్ఫేర్ అసిస్టెంట్, వ్యవసాయ శాఖ ఉద్యోగి మాత్రమే విధుల్లో కనిపించారు. మిగతా 11మంది ఉద్యోగులు సర్వేల కోసం బయటకు వెళ్లిపోయారని ఎంపీడీవో ఎన్.అర్జునరావు తెలిపారు.
- సాలూరు: సాలూరు మండలం కరాసువలస సచివాలయాన్ని సోమవారం ఉదయం 10:20 గంటలకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ.శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నారు. ఆ తరువాత దండిగాం రోడ్డు వద్ద ఏఎన్‌ఎం క నిపించారు. ఇక్కడ మొత్తంగా 12మంది విధులు నిర్వహించాల్సి ఉండగా.. ఒక్కరిద్దరే హాజరయ్యారు. దీనిపై ఎంపీడీవో పార్వతిని వివరణ కోరగా.. సచివాలయ సిబ్బంది అంతా వివిధ రకాల సర్వేల్లో క్షేత్రస్థాయిలో ఉన్నారన్నారు. వీఆర్వో, సర్వేయర్, ఏఎన్‌ఎంలు వారి కార్యాలయల వద్ద ఆన్‌లైన్‌లో హాజరు వేస్తారని, సచివాలయాలకు రారని, మరికొంతమంది సర్వేల్లో ఉన్నారని సచివాలయ అడ్మిన్, కరాసువలస పంచాయతీ కార్యదర్శి రమేష్ ఫోన్ ద్వారా తెలిపారు. ఇక సాలూరు పట్టణంలో 10వ సచివాలయాన్ని (20,21,22 వార్డులు) విజిట్ చేయగా పది మందికి ఆరుగురు సిబ్బందే కనిపించారు.దీనిపై ఇన్‌చార్జి అడ్మిన్ సాయిచంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. ‘అడ్మిన్, వీఆర్వో, ఎనర్జీ సెక్రటరీ పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. ఏఎన్‌ఎం ఉన్నప్పటికీ సచివాలయ కంట్రోల్‌లో లేరు.’ అని తెలిపారు.
- పార్వతీపురం రూరల్: వెంకంపేట సచివాలయంలో గ్రామ సర్వేయర్ సెలవు పెట్టినట్టు రిజిస్టర్‌లో సిఎల్ మార్క్ చేసి ఉంది. కానీ లేఖ మా త్రం లేదు. డిజిటల్ అసిస్టెంట్ కె.సురేష్‌కుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ వి.శ్రీరాములునాయుడు, ఏఎన్‌ఎం విధుల్లో ఉన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ ఎస్.మౌనిక సచివాలయంలో సంతకం చేసిన అనంతరం మందుల కోసమని పశువైద్యశాలకు వెళ్లిపోయారు. అడ్డాపుశీల సచివాలయంలో కార్యదర్శి గణపతి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంతోష్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వెంకటనాయుడు, ఏఎన్‌ఎం కాత్యాయిని, మహిళా పోలీస్ సుజాత మాత్రమే ఉన్నారు. డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు కనిపించలేదు. గ్రామ సర్వేయర్ హిమబిందు సుమారు నెల రోజులు సెలవు పెట్టినట్లు తెలిసింది. రిజిస్టర్‌లో పేరు కూడా లేదు. దీనిపై కార్యదర్శి గణపతిరావు ను వివరణ కోరగా.. సుమారు నెల రోజుల పాటు ఆమె విధులకు హాజరుకాకపోవడం వాస్తవమేనని తెలిపారు.
- భామిని: భామిని సచివాలయాన్ని సోమవారం ఉదయం పది గంటలకు పరిశీలించగా.. పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్ తప్ప ఎవరూ లేరు. కార్యదర్శి నాగేశ్వరరావును వివరణ కోరగా.. ‘డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు డెప్యుటేషన్లపై వెళ్లారు.’ అని తెలిపారు. లివిరి సచివాలయానికి ఉదయం 10.30 గంటలకు వెళ్లగా డిజిటల్ అసిస్టెంట్ మమత ఒక్కరే ఉన్నారు. మిగతా వారి గురించి అడగ్గా.. ఫీల్డ్‌లోకి వెళ్లిపోయారని ఆమె చెప్పారు.
- గరుగుబిల్లి: గొట్టివలస సచివాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.15 గంటల సమయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, వెటర్నరీ సిబ్బంది కనిపించారు. వ్యవసాయశాఖ సిబ్బంది మండల కేంద్రంలోని కార్యాలయానికి, వీఆర్‌వో మరుపెంటలో రెవెన్యూ సమస్య పరిశీలనకు వెళ్లారని, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్‌లు కొంతమేర ఆలస్యంగా విధులకు హాజరయ్యారని సచివాలయ కార్యదర్శి పి.శిరీష తెలిపారు. గరుగుబిల్లి సచివాలయంలో కార్యదర్శితో పాటు డిజిటల్ అసిస్టెంట్, మత్స్యశాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్లు హాజరయ్యారు. మహిళా పోలీస్, ఏఎన్‌ఎం, సర్వేయర్, వీఆర్‌వోలు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారని కార్యదర్శి కీర్తి వెల్లడించారు.