ఎప్పటికి పరిష్కరిస్తారో?
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:55 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ఇటువంటి భూ సమస్యలు చాలా ఉన్నాయి.
- వెంటాడుతున్న భూ రీసర్వే సమస్యలు
-విస్తీర్ణం తగ్గడంతో రైతుల్లో ఆందోళన
- అధికారులు చుట్టూ తిరుగుతున్న వైనం
- గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే జరిగింది. గ్రామానికి చెందిన ఓ రైతుకు ఏఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌ఏ ప్రకారం రెండు సర్వేనెంబరు కలిసి 45 సెంట్ల విస్తీర్ణం భూమి ఉండేది. అయితే రీసర్వేపూర్తి అయిన తరువాత ఆ రైతు భూమి వెబ్ ల్యాండ్‌లో 39 సెంట్లే చూపిస్తుంది. మిగిలిన ఆరు సెంట్లు కూడా తన పేరున వచ్చే విధంగా చూడాలని రెవెన్యూ అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం శూన్యం.
- బొండపల్లి మండలం జీపీ అగ్రహారం గ్రామంలో చేపట్టిన రీసర్వేలో ఓ రైతుకు తన పాత 1బీ ప్రకారం ఓ సర్వే నెంబరులో ఉన్న భూ విస్తీర్ణం కంటే మూడు సెంట్లు తగ్గింది. దీంతో ఆ రైతు మూడు సెంట్లు భూమిని 1బీలో వచ్చే విధంగా చేయాలని రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. నెలల తరబడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.
కలెక్టరేట్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ఇటువంటి భూ సమస్యలు చాలా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా జాయింట్ ఎల్‌పీఎంలను సబ్ డివిజన్‌లు చేసుకోవడానికి, సరిహద్దు సమస్యలు, విస్తీర్ణం సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం 2020 డిసెంబరులో రీ సర్వే ప్రక్రియను మొదలు పెట్టింది. జిల్లాలో సుమారు 504 గ్రామాల్లో రీసర్వే పూర్తయినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చాయి. భూ విస్తీర్ణం తగ్గిపోవడం, ఒకే భూమికి జాయింట్ ఎల్‌పీఎం కేటాయింపు, సర్వే నెంబర్లు కనిపించకపోవడం, పట్టాదారు పాసుపుస్తకంలో ఒకరి ఫొటోకు బదులు మరొక ఫొటోని ముద్రించడం వంటి సమస్యలు తలెత్తాయి. వీటిని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం గ్రామాల్లో సభలు నిర్వహించి వినతులను స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 24 వేలు వరకు వినతులు వచ్చాయి. అయితే వీటిని అధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించకపోవ డంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా భూ విస్తీర్ణం సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్య మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో డివిజన్, జిల్లా కేంద్రానికి రైతులు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి భూసమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.