Share News

When Will They Give It? ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:13 AM

When Will They Give It? జిల్లాలో దోమ తెరల పంపిణీ జరిగి ఆరున్నరేళ్లు అయింది. దీని కాల పరిమితి ముగియడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 4 లక్షల లాంగ్‌ లాస్టింగ్‌ ఇన్‌సెక్టిసైడల్‌ నెట్‌ దోమ తెరలకు ఏడాదిన్నర కిందటే ప్రతిపాదనలు పంపించింది. కానీ నేటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయకపోవడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.

 When Will They Give It?  ఎప్పుడిస్తారో?
జియ్యమ్మవలస మండలంలో మలేరియా ప్రభావిత గ్రామం వనజ

  • జిల్లాలో 698 మలేరియా ప్రభావిత గ్రామాలు

  • వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న మన్యం వాసులు

జియ్యమ్మవలస, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దోమ తెరల పంపిణీ జరిగి ఆరున్నరేళ్లు అయింది. దీని కాల పరిమితి ముగియడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 4 లక్షల లాంగ్‌ లాస్టింగ్‌ ఇన్‌సెక్టిసైడల్‌ నెట్‌ దోమ తెరలకు ఏడాదిన్నర కిందటే ప్రతిపాదనలు పంపించింది. కానీ నేటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయకపోవడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మన్యంలో మళ్లీ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రాంతాల్లో అత్యధికులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి వైద్యాధికారులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నా.. పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కాగా దీనికి ప్రధాన కారణం దోమలేనని జ్వరపీడితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే దోమ తెరలు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో 34 మండలాల పరిధిలో 921 పంచాయతీల్లో 4,42,400 దోమ తెరలను పంపిణీ చేశారు. ఆ తరువాత నుంచి వాటి పంపిణీ జరగలేదు. 2022లో పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడిన తరువాత కూడా దోమ తెరలను అందించలేదు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం దోమ తెరల కాల పరిమితి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు. అయితే పంపిణీ జరిగి ఆరేళ్లు కావస్తున్నా.. ఇంకా ఈ దోమ తెరలు జిల్లాకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో మలేరియా, డెంగ్యూ జ్వర ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వారంతా దోమ తెరల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 698 మలేరియా ప్రభావిత గ్రామాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వీటిల్లో 90 హైరిస్క్‌ గ్రామాలు కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ప్రజలకు దోమ తెరల అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా కొన్ని గిరిజన గ్రామాల్లో ప్రజలకు దోమ తెరల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంది. లేదంటే చేపలు పట్టడానికి, మొక్కలకు కంచెలా వినియోగించనున్నారు.

పెరుగుతున్న కేసులు

జిల్లాలో 37 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌లు, మూడు సీహెచ్‌సీలు, మూడు ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి పరిధిలో రక్త నమూనాలు సేకరించి తదనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నారు. మరణాలు లేకపోయినప్పటికీ కేసుల పెరుగుల వైద్య ఆరోగ్యశాఖకు తీవ్ర తలనొప్పిగా మారింది. మరోవైపు వ్యాధి తీవ్రతను తగ్గించడానికి హైరిస్క్‌ గ్రామాల్లో యాంటీ లార్వల్‌ స్ర్పేయింగ్‌ కాలువల శుభ్రత, డ్రైడే, తదితర కార్యక్రమాలు చేపడుతున్నా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి దోమ తెరల పంపిణీకి తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రతిపాదనలు పంపించాం

జిల్లాకు 4.42 లక్షల దోమ తెరలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.

వై.మణి, జిల్లా మలేరియా అధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 19 , 2025 | 12:13 AM