When Will They Give It? ఎప్పుడిస్తారో?
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:56 PM
When Will They Give It? నిత్యావసర సరుకులకే కాదు.. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవగా.. వేలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. నూతన కార్డుల కోసం కొందరు.. మార్పులు, చేర్పులు, తొలగింపు, సరెండర్, స్ల్పిట్ కోసం మరికొందరు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎటువంటి ప్రకటన లేకపోవడంతో దరఖాస్తుదారులు నూతన కార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మార్పులు, చేర్పులకు వేలాది దరఖాస్తులు
త్వరితగతిన మంజూరు చేయాలని ప్రజల విన్నపం
పార్వతీపురం, జూలై 20(ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకులకే కాదు.. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది మే 7వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవగా.. వేలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. నూతన కార్డుల కోసం కొందరు.. మార్పులు, చేర్పులు, తొలగింపు, సరెండర్, స్ల్పిట్ కోసం మరికొందరు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎటువంటి ప్రకటన లేకపోవడంతో దరఖాస్తుదారులు నూతన కార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. మార్పులు, చేర్పులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఐదేళ్ల నుంచి ఎంతో మంది దరఖాస్తులు చేసుకుని కొత్త రేషన్ కార్డుల కోసం కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం అర్హులైన వారు కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడంతో గ్రామ, సచివాలయాల్లో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికీ ఎంతోమంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల జారీపై స్పష్టత కొరవడింది. దీంతో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొత్త రేషన్‌కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారో చెప్పాలని అడుగు తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇది...
జిల్లాలో ప్రస్తుతం 2,76,703 రైస్‌కార్డులు ఉన్నాయి. ఇందులో డబ్ల్యూఏపీ కార్డులు 2,22,394 , అంత్యోదయ కార్డులు 54,309 వరకూ ఉన్నాయి. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు అధికారులకు 2,284 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా భామిని మండలం నుంచి 157 దరఖాస్తులు అందాయి. బలిజిపేట వంద, గరుగుబిల్లి 138, గుమ్మలక్ష్మీపురం 140, జియ్య మ్మవలస 125, కొమరాడ 152, కురుపాం 142, మక్కువ 134, పాచిపెంట 145 చొప్పున దరఖాస్తులు చేరాయి. పాలకొండ మండలం 125, పాలకొండ అర్బన్ 66, పార్వతీపురం అర్బన్ 96, పార్వతీపురం రూరల్ 141, సాలూరు రూరల్ 150, సాలూరు అర్బన్ 129, సీతంపేట రూరల్ 19, సీతానగరం 112, వీరఘట్టం 109 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
మరికొన్ని ఇలా..
చిరునామా మార్పు కోసం 403 దరఖాస్తులు, రైస్‌కార్డులో మార్పుల కోసం 249, ఆధార్‌లో ఉన్న తప్పులు సరిదిద్దేందుకు 326 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా కుటుంబ సభ్యుల యాడింగ్ కోసం 25,824, రైస్‌కార్డు నుంచి పేర్లును తొలగింపునకు 651, స్ల్పిట్ కోసం 3,859, కార్డులు సరెండర్ కోసం తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఈ విధంగా కొత్త రేషన్‌కార్డులతో కలుపుకుని మొత్తంగా 33,613 దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట ప్రభుత్వం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. కార్డుల్లో పేర్లు తొలగింపు, ఇతర రాష్ర్టాలు, విదేశాలకు వెళ్లిపోయే వారి పేర్లు డిలీట్ చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో దరఖాస్తులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు మృతి చెందిన వారిపేర్లు మాత్రమే తొలగిస్తున్నారు. అయితే మిగిలిన దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఆదేశాలు రాగానే మంజూరు చేస్తాం
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం.
- శ్రీనివాసరావు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి, పార్వతీపురం