Share News

When Will They Come..? ఎప్పుడొస్తాయో..?

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:01 PM

When Will They Come..? గత వైసీపీ సర్కారు తీరుతో జిల్లాలో కొంతమంది గృహ నిర్మాణ లబ్ధిదారులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. బిల్లులు మంజూరు కాక.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీమ్‌, పీఎంఏవై గ్రామీణ్‌ లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు.

When Will They Come..? ఎప్పుడొస్తాయో..?
బిల్లులు అందక కొత్తవలసలో మధ్యలో నిలిచిన పీఎంఏవై గ్రామీణ్‌ ఇళ్ల నిర్మాణాలు

  • గత వైసీపీ హయాంలో తీరని అన్యాయం

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

జియ్యమ్మవలస, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు తీరుతో జిల్లాలో కొంతమంది గృహ నిర్మాణ లబ్ధిదారులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. బిల్లులు మంజూరు కాక.. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీమ్‌, పీఎంఏవై గ్రామీణ్‌ లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. అప్పటికే టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లన్నింటిని వైసీపీ సర్కారు రద్దు చేస్తూ బిల్లులను నిలుపుదల చేసింది. దీంతో గృహ లబ్ధిదారులు అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌) పేరుతో ఇళ్లు మంజూరు చేసింది. కొంతమంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకొచ్చారు. కానీ వారికి వైసీపీ సర్కారు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆ పథకం లబ్ధిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు, నిర్లక్ష్యం కారణంగా కోట్లలో బిల్లులు పేరుకుపోయాయి. అయితే ఆయా బిల్లుల చెల్లింపుపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో వాటి కోసం జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ పరిస్థితి ..

- ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీమ్‌ (2016-19)లో జిల్లాలో 4,030 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇళ్లు ప్రారంభం కానివి 95, బిలో బేస్‌మెంట్‌ లెవెల్‌లో 230, బేస్‌మెంట్‌ లెవెల్‌లో 880, లింటల్‌ లెవెల్‌లో 2, రూఫ్‌ లెవెల్‌లో 327, రూఫ్‌ కంప్లీటెడ్‌ దశలో 1962 గృహాలు ఉన్నాయి. పూర్తయిన ఇళ్లు 534 వరకు ఉన్నాయి. అయితే లబ్ధిదారులకు ఇంకా రూ. 12.17 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షలు ఇచ్చేవారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులైతే అదనంగా మరో రూ. 50 వేలు ఇచ్చేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఇళ్లు లబ్ధిదారుల బిల్లుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో వారు అప్పులు తీర్చడానికి వలసబాట పట్టాల్సిన పరిస్థితి.

- వైసీపీ ప్రభుత్వం చివరి దశలో ఉండగా కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గ్రామీణ్‌ పథకం మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. ఇందులో అడ్వాన్స్‌ రూపంలో రూ. 40 వేలు, బేస్‌మెంట్‌ లెవెల్‌ నుంచి రూఫ్‌ లెవెల్‌ వరకు రూ. 70 వేలు, రూఫ్‌ కంప్లీటెడ్‌కు రూ. 20 వేలు, సిమెంట్‌కు రూ. 20 వేలు, ఉపాధి హామీ ద్వారా రూ. 18 వేలు, ఐఎస్‌ఎల్‌ నిర్మాణానికి రూ. 12 వేలు ఇచ్చారు. జిల్లాలో పీఎంఏవై (గ్రామీణ్‌) పథకానికి మొత్తం 3,584 మందికి ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ (ఎఫ్‌టీవో)లు జనరేట్‌ చేశారు. ఇందులో 397 మందికి రూ. 1.51 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే గత ఆరు నెలలుగా ఈ బిల్లులు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు.

- ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీమ్‌, పీఎం ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌)కు సంబంధించి మొత్తంగా రూ.13.67 కోట్ల మేర బిల్లుల బకాయిలున్నాయి. కాగా ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీంలో ఇళ్లు మంజూరైన వారిలో చాలామంది గత ఆరున్నర, ఏడేళ్లుగా పురిపాకల్లోనే జీవనం సాగిస్తున్నారు. చిన్న చిన్న షెడ్లలో ఉండలేక, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పీఎం ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌)కు సంబంధించిన లబ్ధిదారుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.

ప్రభుత్వానికి నివేదించాం

బిల్లులు పెండింగ్‌లో ఉండడం వాస్తవమే. ఈ విషయాన్ని కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంది.

- పి.ధర్మచంద్రారెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Oct 08 , 2025 | 11:01 PM