Share News

దీర్ఘకాల సమస్యలకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:28 AM

జిల్లాను దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరి ష్కారం లభించడం లేదు. ఎన్నికల హామీలుగానే మిగిలిపోతుండడంతో ప్రజలకు అవస్థలు తప్ప డం లేదు.

 దీర్ఘకాల సమస్యలకు మోక్షమెప్పుడో?
నిలిచిన పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు

- పార్వతీపురంలో బైపాస్‌ రహదారి నిర్మాణం ఎప్పటికో..

- నిధులు మంజూరైనా.. సాగని పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం

- కొలిక్కిరాని ఒడిశా వివాదం.. పూర్తికాని జంఝావతి పెండింగ్‌ పనులు

- ఇబ్బందుల్లో ప్రజలు, రైతులు .. కూటమి ప్రభుత్వంపై ఆశలు

పార్వతీపురం, నవంబరు13(ఆంధ్రజ్యోతి): జిల్లాను దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరి ష్కారం లభించడం లేదు. ఎన్నికల హామీలుగానే మిగిలిపోతుండడంతో ప్రజలకు అవస్థలు తప్ప డం లేదు. జిల్లా కేంద్రంలో బైపాస్‌ రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. నిధులున్నా.. కురు పాం నియోజకవర్గంలో పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణం ముందుకు సాగడం లేదు. మరోవైపు జంఝావతి పెండింగ్‌ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వాటిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి.. పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

జిల్లాకేంద్రంలో..

జిల్లా కేంద్రం పార్వతీపురంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. భారీ వాహ నాలు ప్రయాణించే సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రధాన రహదారిలో ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోతుండడంతో పాదచారులు కూడా రాక పోకలు సాగించలేకపోతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బైపాస్‌ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బైపాస్‌ రహదారి నిర్మాణం కోసం ఎటువంటి ప్రకటన రాలేదు. పట్టణంలో రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ పనులు చేపట్టిన సమయంలోనే బైపాస్‌ రహదారి నిర్మాణం కూడా చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పూర్ణపాడు-లాబేసు వంతెన..

కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నిధులున్నా పనులు ముందుకు సాగడం లేదు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 80 శాతం వరకూ ఈ వంతెన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దీని నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో సుమారు 30 గ్రామాల ప్రజలు ఏటా వర్షా కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి నది దాటలేక.. చుట్టూ తిరిగి స్వగ్రామాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు నాటు పడవను ఆశ్రయించి ప్రమాదకర స్థితిలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ సమస్యను మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. అయితే నెలలు గడుస్తున్నా.. పనులు ప్రారంభించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పంచాయతీరాజ్‌శాఖ జిల్లా ఇంజనీరింగ్‌ అధికారి నగేష్‌ బాబును వివరణ కోరగా.. ‘ ఇప్పటివరకు రెండుసార్లు టెండర్లు పిలిచినా.. ఎవరూ ముందుకు రాలేదు. మూడోసారి టెండర్‌ నిర్వహించేందుకు ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతులు వచ్చిన వెంటనే ప్రక్రియ నిర్వహిస్తాం.’ అని తెలిపారు.

జంఝావతి పరిస్థితి ఇదీ..

జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు జంఝావతి ప్రాజెక్టు పెండింగ్‌ పనులు కూడా పూర్తవడం లేదు. ఏళ్లు గడుస్తున్నా..ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాలు పరిష్కారం కావడం లేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. శివారు ప్రాంత రైతులు వరుణుడిపై ఆధారపడి సాగుచేసుకోవాల్సి వస్తోంది. 24 వేల ఎకరాలకు గాను ప్రాజెక్టు ద్వారా కేవలం 7వేల ఎకరాలకే సాగునీరు అందుతుంది. ప్రస్తుతం జంఝావతి ప్రాజెక్టు హైలెవెల్‌ కెనాల్‌తో పాటు మిగిలిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒడిశాతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని పక్కన పెట్టి.. స్థానిక వనరులను ఉపయోగించుకుని వ్యవసాయ భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:28 AM