Share News

‘యోగాంధ్ర’ నిధులు ఎప్పుడిస్తారు?

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:21 AM

జిల్లాలో యోగాంధ్ర వేడుకలు జరిగి రెండు నెలలు దాటింది. కానీ, ఇంతవరకూ యోగాంధ్ర కోసం ఖర్చుచేసిన నిధులు మాత్రం జమకాలేదు.

 ‘యోగాంధ్ర’ నిధులు ఎప్పుడిస్తారు?

రెండు నెలలు దాటుతున్నా విడుదల కాని వైనం

జిల్లావ్యాప్తంగా 5,900 కేంద్రాల్లో యోగాసనాలు

చేతి చమురు వదిలించుకున్న అధికారులు

రాజాం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యోగాంధ్ర వేడుకలు జరిగి రెండు నెలలు దాటింది. కానీ, ఇంతవరకూ యోగాంధ్ర కోసం ఖర్చుచేసిన నిధులు మాత్రం జమకాలేదు. దీంతో మండల, మున్సిపాల్టీ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. జూన్‌ 21న విశాఖలో జరిగిన యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జిల్లా నుంచి 30 వేల మందికిపైగా విశాఖ తరలివెళ్లారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మునిసిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 5,900 వేదికలపై నిర్వహించారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించిన యంత్రాంగానికి మాత్రం చేతిచమురు వదులుకోవాల్సి వచ్చింది.

సొంత ఖర్చులతో నిర్వహణ..

యోగాంధ్ర వేడుకలకు కనీసం రూ.20వేల నుంచి రూ.25 వేల వరకూ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. అధికారులు సొంత నిధులు ఖర్చు చేస్తే, తిరిగే ఆ డబ్బులు ఇస్తామని చెప్పింది. దీంతో జిల్లా అధికారులు సొంత డబ్బులు ఖర్చుచేసి యోగాసనాల వేదికలను సిద్ధం చేశారు. మైదానాలను చదును చేసి మట్టివేశారు. మ్యాట్లు కూడా కొనుగోలు చేశారు. తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం కావడంతో స్నాక్స్‌తో పాటు టీని సైతం అందుబాటులో ఉంచారు. అయితే ఏ అధికారికి ఇంతవరకూ యోగాంధ్ర వేడుకల నిర్వహణ ఖర్చులు జమ చేయలేదు. కొన్నిచోట్ల కూలీలకు కూడా ఇంతవరకు నగదు చెల్లించలేదు. ప్రభుత్వానికి నివేదికలు అయితే వెళ్లాయి తప్ప నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విన్నవిస్తున్నారు. ఈ విషయమై రాజాం ఎంపీడీవో వి.శ్రీనివాసరావును వివరణ కోరగా.. ‘యోగాంధ్ర నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే కూలీలకు అందించేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 12:21 AM