రోడ్లు బాగుపడేదెప్పుడో?
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:54 PM
బొబ్బిలి నియోజకవర్గంలోని అంతర్రాష్ట్ర రహదారులతో పాటు రాష్ర్టీయ రహదారులు, స్థానిక రోడ్లు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి.
- దారుణంగా తయారైన రహదారులు
- నిధులున్నా చేపట్టని పనులు
- టెండర్ల ప్రక్రియ పూర్తయినా నిర్లక్ష్యం
- జనానికి తప్పనితిప్పలు
బొబ్బిలి జూలై 1 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి నియోజకవర్గంలోని అంతర్రాష్ట్ర , రాష్ర్టీయ , స్థానిక రోడ్లు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ పట్టించుకోకపోవడంతో అవి నరకానికి నకళ్లుగా మారాయి. గోతులు, రాళ్లతో దారుణంగా కనిపిస్తోన్నాయి. వీటిపై ప్రయాణమంటేనే వాహనచోదకులు, ప్రజలు హడలిపోతున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఆ రోడ్లు ఇంకా బాగుపడడం లేదు. తమ నియోజకవర్గ పరిధిలోని రోడ్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన బాగుచేయండి అంటూ సాక్షాత్తూ ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా సంబంధిత మంత్రులు, అధికారులు, కలెక్టర్‌ను కలిసి పదేపదే కోరడంతో పలు రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతోంది. కానీ, పనులు మాత్రం చేపట్టడం లేదు. తాత్కాలికంగా బాగుచేసిన రోడ్లన్నీ ప్రస్తుతం వర్షాలకు మళ్లీ పాడైపోతున్నాయి. దీనివల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి.
ఇదీ పరిస్థితి..
బొబ్బిలి-తెర్లాం, బొబ్బిలి-రామభద్రపురం, పినపెంకి -ఆకులకట్ట, బొబ్బిలి-మక్కువ, బొబ్బిలి-డొంగురువలస వయా గిరిజనగ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. బొబ్బిలి నుంచి గొల్లపల్లి, అలజంగి, కారాడ మీదుగా తెర్లాం వరకు ఉన్న రోడ్డు దారుణంగా ఉంది. బొబ్బిలి నుంచి రామభద్రపురం రాష్ర్టీయ రహదారి మీదుగా విశాఖ, విజయనగరం, రాయగడ, రాయపూర్ ప్రాంతాలకు ప్రతిరోజూ లెక్కకుమించి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు పూర్తిగా ఛిద్రమైపోయాయి. పారాది బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర తరమైంది. దీని సమీపంలోని కల్వర్టు ఇటీవల కూలిపోయింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాష్ర్టీయ రహదారిపై ఉన్న కల్వర్టు తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.8.5లక్షలతో, శాశ్వత పనుల కోసం రూ.92 లక్షలతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే ఉత్తరావల్లి నుంచి రామభద్రపురం మీదుగా బొబ్బిలి వరకు అక్కడక్కడ పాడైన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు రూ.4.5 కోట్లు, ఆకులకట్ట-పినపెంకి రోడ్డుకు రూ.2.9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే అత్యంత ప్రధానమైన బొబ్బిలి-తెర్లాం రోడ్డు పనులకు కూడా టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. అయితే, వర్షాకాలంలో ఈ పనులు జరిగే పరిస్థితి లేకపోవడంతో రహదారులు మరింత దారుణంగా మారనున్నాయి. దీంతో ఇంకెన్నాళ్లు సహవాసం చేయాలోనని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నరకం చూస్తున్నాం
బొబ్బిలి-తెర్లాం రహదారి చాలా దారుణంగా ఉంది. వాహనచోదకులు, ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు నరకం చూస్తున్నారు. ప్రతి రోజూ నేను ఈ రోడ్డు సుమారు 20 కిలోమీటర్లకు పైగా బైక్‌పై వెళ్తుంటా. గమ్యస్థానం చేరుకునే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఈ రోడ్డు సమస్య పరిష్కారం కావడం పెద్ద విషయమేమీ కాదు. ప్రభుత్వ పెద్దలు స్పందించి రోడ్డుని బాగు చేయాలి.
-గంట సత్యనారాయణ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బొబ్బిలి
వాతావరణం సమస్యగా మారింది
రహదారుల మెరుగుకోసం మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని రోడ్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. మరికొన్ని చివరిదశలో ఉన్నాయి. పారాది కల్వర్టుకు రూ.92 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు మమ్మల్ని పరుగులు తీయిస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతూనే ఉన్నాం. నిధులు కూడా విడుదలవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా ఉండడం పెద్దసమస్యగా మారింది.
-ఎంఎస్‌ఎస్‌ఎస్ వెంకటరావు, డీఈఈ ఆర్‌అండ్‌బీ, బొబ్బిలి