When will the road expansion take place? రోడ్డు విస్తరణ ఇంకెప్పుడు?
ABN , Publish Date - May 13 , 2025 | 11:17 PM
When will the road expansion take place? డివిజన్ కేంద్రం పాలకొండ ప్రధాన రహదారి విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా పనులు జరగకపోవడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రోజూ నరకం చూస్తున్నారు.
నరకం చూస్తున్న వాహనదారులు, ప్రయాణికులు
గాలిలో కలిసిపోయిన గత వైసీపీ ప్రభుత్వ హామీ
ఐదేళ్లూ హడావుడితోనే సరి.. ప్రతిపాదలనకే పరిమితమైన పనులు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
పాలకొండ, మే 13(ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రం పాలకొండ ప్రధాన రహదారి విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా పనులు జరగకపోవడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రోజూ నరకం చూస్తున్నారు. పట్టణంలో ఆర్టీసీ డిపో నుంచి వీరఘట్టం జంక్షన్ వరకు 2.1 కిలోమీటర్ల ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడతామని గత వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. అయితే ఐదేళ్ల కాలంలో రహదారి విస్తరణ చేపట్టలేకపోయింది. దీంతో ప్రజలకు నిరాశే మిగిలింది. విస్తరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమైన క్రమంలో పట్టణవాసులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి..
పాలకొండలో నెలకొన్న ట్రాఫిక్ దృష్ట్యా వంద అడుగులు మేర రహదారి విస్తరణ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 60 అడుగులు మేర మాత్రమే రహదారి ఉంది. ప్రధానంగా ఏలాం జంక్షన్ నుంచి వీరఘట్టం జంక్షన్ వరకు రహదారి విస్తరణ పనులు జరిగితే తప్ప ట్రాఫిక్ సమస్య నుంచి వాహనచోదకులు, ప్రయాణికులు గట్టెక్కే పరిస్థితి లేదు. వాస్తవంగా పట్టణంలోని ప్రధాన రహదారి నుంచి రోజూ వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాతో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే భారీ వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటాయి. విజయనగరం జిల్లా రేగిడి మండలంలో ఉన్న చక్కెర కర్మాగారానికి ఈ మార్గం గుండానే చెరుకు లోడ్లతో వాహనాలు వెళ్తుంటాయి. అయితే పాలకొండ ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బల్లంకివీధి జంక్షన్, కోటదుర్గమ్మ ఆలయ జంక్షన్, నాగావంశంపు వీధి, ఆర్టీసీ కాంప్లెక్స్, వడమ జంక్షన్‌లో నిత్యం వాహనాలు నిలిచిపోతున్నాయి. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చినా, భారీ వాహనాలు వచ్చినా అంతే సంగతి. వాహనదారులకు నిరీక్షణ తప్పడం లేదు.
రహదారికిరువైపులా ఆక్రమణలు..
పాలకొండ ప్రధాన రహదారికి ఇరువైపులా ఇష్టానుసారంగా వాణిజ్య సముదాయాలు పుట్టుకొస్తున్నాయి. సుమారు 450 నుంచి 550 వరకు అక్రమ కట్టడాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాలువలపై ఆక్రమణలు పెరిగిపోవడంతో రహదారి మరింత ఇరుకుగా తయారైంది. రహదారి పొడువునా ఇదే పరిస్థితి ఉండడంతో ట్రాఫిక్ మరింత జఠిలమవుతుంది. దీనిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ప్రభుత్వం చొరవ..
పీపీపీ విధానంలో కళింగపట్నం, శ్రీకాకుళం, పాలకొండ మీదుగా పార్వతీపురం వరకు ఉన్న 113.40 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సర్వేను కూడా పూర్తి చేసింది. రహదారి విస్తరణతో పాలకొండలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని, వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.
రూ.16.5 కోట్లతో ప్రతిపాదనలు
పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి వీరఘట్టం జంక్షన్ వరకు ప్రధాన రహదారి విస్తరణకు రూ.16.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రధాన రహదారుల విస్తరణకు సర్వే చేసింది. నిధులు మంజూరైతే 80 అడుగుల రహదారి విస్తరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా కాలువలు నిర్మాణం, సెంటర్ లైటింగ్ పనులు చేపడతాం.
- కిరణ్‌కుమార్, జేఈ, ఆర్‌అండ్‌బీ