Recovery రికవరీ ఎప్పుడో?
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:04 PM
When Will the Recovery Happen? జిల్లాలోని పలు పంచాయతీలకు మంజూరైన అభివృద్ధి నిధులు పక్కదారి పట్టినా.. అధికారుల్లో చలనం ఉండడం లేదు. రికవరీ ఊసెత్తడం లేదు. బాధ్యులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చిన తర్వాత హడావుడి చేసే అధికారులు .. ఆ తరువాత మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
చర్యలు నామమాత్రం
విచారణ.. క్షేత్రస్థాయి సిబ్బంది సస్పెండ్లతోనే సరి
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
పార్వతీపురం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పంచాయతీలకు మంజూరైన అభివృద్ధి నిధులు పక్కదారి పట్టినా.. అధికారుల్లో చలనం ఉండడం లేదు. రికవరీ ఊసెత్తడం లేదు. బాధ్యులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చిన తర్వాత హడావుడి చేసే అధికారులు .. ఆ తరువాత మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని జోగింపేట పంచాయతీ పరిధిలో రూ.34.30 లక్షలు దుర్వినియోగమైనట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ మేరకు జూలై 19న నలుగురు సచివాలయ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. కొమరాడ పంచాయతీలో రూ.21.15 లక్షలు పక్కదారినట్లు సంబంఽధిత అధికారులు గుర్తించారు. దీంతో గత నెల 12న ఇక్కడ కూడా నలుగురు కార్యదర్శులను సస్పెండ్ చేశారు. సర్పంచ్ చెక్ పవర్ కూడా రద్దు చేశారు. అయితే పక్కదారి పట్టిన సొమ్ము రికవరీ మాత్రం ఇప్పటివరకు చేయలేదు. పార్వతీపురం మండలంలో రూ.8.21 లక్షలు దుర్వినియోగమైనట్లు విచారణలో తేల్చారు. అయితే సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా.. నేటికీ రికవరీ చేయలేదు. జియ్యమ్మవలస మండలంలో పక్కదారి పట్టిన రూ.33.30 లక్షల కూడా అతీగతీ లేదు. ఇదిలా ఉండగా.. జూలై 19న సస్పెన్షన్‌కు గురైన నలుగురు కార్యదర్శులకు నేటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ గత నెల 12న సస్పెండ్ అయిన నలుగురిలో ముగ్గురికి తిరిగి రీపోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై డీపీవో కొండలరావును వివరణ కోరగా.. ‘పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారి నుంచి రికవరీ చేస్తున్నాం. ఈ అంశంలో సస్పెండ్ అయిన సిబ్బందికి తిరిగి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. జూలై 19న సస్పెండ్ చేసిన కార్యదర్శుల ఫైల్స్ సిద్ధం చేస్తున్నాం. త్వరలో వారికి కూడా పోస్టింగ్‌లు ఇస్తాం.’ అని తెలిపారు.