పోస్టుల భర్తీ ఎప్పుడో?
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:26 AM
జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది.
- గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత
- 86 మందికి ఉన్నది 36 మందే!
- కష్టంగా మారిన లైబ్రరీల నిర్వహణ
రాజాం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. లైబ్రరియన్‌తో పాటు అసిస్టెంట్ లైబ్రరియన్, ఇతరత్రా పోస్టులు 86 ఉండగా..అందులో 36 మందే విధులు నిర్వహిస్తున్నారు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితో గ్రంథాలయాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్రేడ్-2, గ్రేడ్-3, సహాయకులు, రికార్డు అసిస్టెంట్లు ఆఫీస్ సహాయకులు, స్వీపర్లు వంటి వారు 86 మంది ఉండాలి. కానీ 36 మంది మాత్రమే ఉంటున్నారు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా పోస్టులను భర్తీ చేయాలని పాఠకులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో డిస్ర్టిక్ట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు 40 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో ద్వితీయ శ్రేణి కింద ఎస్.కోట, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి గ్రంథాలయాలు ఉన్నాయి. కెల్ల, రెల్లివలస, జరజాపుపేట రూరల్ లైబ్రరీలుగా కొనసాగుతున్నాయి. 33 గ్రామీణ గ్రంథాలయాలుగా ఉన్నాయి. విజయనగరంలోని కేంద్ర లైబ్రరీకి రోజుకు 700 నుంచి 1000 మంది వరకు పాఠకులు వస్తుంటారు. మిగిలిన చోట్ల 200 మంది పాఠకులు ఉంటారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 55 వేలు, మిగతాచోట్ల 35 వేల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు పుస్తకాలను అందుబాటులో తెస్తున్నారు. మ్యాగజైన్లు, రోజువారి దినపత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం డిజిటల్ గ్రంథాలయాల పేరిట ఉన్న గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకుపైగా డిజిటల్ గ్రంథాలయాలను మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను రూ.16 లక్షలు కేటాయించింది. కానీ ఒక్కచోట కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసింది.
మెరుగుపరచాలి..
రాజాంలో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటవుతుందని ఆశించాం. కానీ గ్రంథాలయం ఏర్పాటు చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఉన్న గ్రంథాలయాలను సైతం గాలికొదిలేసింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృస్టిసారించాలి. గ్రంథాలయాల నిర్వహణను మెరుగుపరచి పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.
-కంచుపల్లి శ్రీనివాసరావు, నిరుద్యోగ యువకుడు, రాజాం