Share News

వంతెన కల నెరవేరేదెప్పుడో?

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:08 AM

వట్టిగెడ్డ రిజర్వాయర్‌.. ఇది జియ్యమ్మవలస మండలం ప్రధాన సాగునీటి వనరు. మొత్తం 16,684 ఎకరాలకు సాగునీరందించే రిజర్వాయర్‌.

 వంతెన కల నెరవేరేదెప్పుడో?
వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన కాజ్‌వే పైనుంచి ప్రవహిస్తున్న వరద

- ఐదు దశాబ్దాలుగా గిరిజనుల ఎదురుచూపు

- వట్టిగెడ్డ రిజర్వాయర్‌కు వరదొస్తే 30గ్రామాలకు రాకపోకలు బంద్‌

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

జియ్యమ్మవలస, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వట్టిగెడ్డ రిజర్వాయర్‌.. ఇది జియ్యమ్మవలస మండలం ప్రధాన సాగునీటి వనరు. మొత్తం 16,684 ఎకరాలకు సాగునీరందించే రిజర్వాయర్‌. అయితే, వర్షా కాలంలో రిజర్వాయర్‌లో వరద ఉధృతమైతే తూర్పు ప్రాంత ఏజెన్సీ గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రిజర్వాయర్‌ దిగువన మినీ వంతెన నిర్మాణం కోసం గిరిజనులు ఐదు దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులకు ఎన్నో వినతులు ఇచ్చారు. అయినా ఫలితం శూన్యం. వంతెన నిర్మాణం నేటికీ కలగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వ పెద్దలు గాని, జిల్లాకు వ చ్చిన కొత్త కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గాని స్పందించి మినీ వంతెన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటారా? అని ఈ ప్రాంత గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

వరదొస్తే అంతే..

జియ్యమ్మవలస మండలంలోని తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో టీకే జమ్ము (తామరకండి జమ్ము), పెదతోలుమండ, కొండచిలకాం, అలమండ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో కూటం, పాండ్రసింగి, కోడిపిల్లగూడ, గొర్లి, గొర్లివలస, టీకే జమ్ము, నడిమిసిరిపి, పల్లపుసిరిపి, జమ్మువలస, పీటీ మండ, బాపన్నగూడ, దీసరిగూడ, చాపరాయిగూడ, పెదదోడిజ, ద్రాక్షిణి, చినదోడిజ, చిలకాంవలస, కొండచిలకాం, బల్లేరుగూడ, బల్లేరు, కిడిగేసు, కొండనిడగళ్లు, నిడగళ్లుగూడ, రావాడ రామభద్రపురం, ఎస్సీ మరువాడ, ఎస్టీ మరువాడ, చినతోలుమండ, చినతోలుమండగూడ, నీలకంఠాపురం, అలమండ అనే 30 గిరిజన గ్రామాలు ఉన్నాయి. దాదాపు వెయ్యి గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 90 శాతం గిరిజనులు కొండలో పండిన సీతాఫలం, చింతపండు, జామ, సపోట, తదితర పంటలను కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గొరడ గ్రామాల్లో జరిగే వారపు సంతలకు తెచ్చి అమ్ముకుంటూ ఆ డబ్బులతో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ పంటలన్నీ వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన ఉన్న కాజ్‌వే పైనుంచే తీసుకెళ్తారు. వర్షాలు ఎక్కువగా కురిస్తే ఈ కాజ్‌వే పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు పూర్తిగా ఈ 30 గ్రామాల ప్రజలకు బాహ్యా ప్రపంచం నుంచి సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలో తమ జీవనం దుర్భరంగా ఉంటుందని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కష్టాలు తీరెదెన్నడో?

వట్టిగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం 1976లో జరిగింది. అప్పటి నుంచి వీరికి ఈ కష్టాలు తప్పడం లేదు. తూర్పు ఏజెన్సీ ప్రాంతం వైపు వెళ్లే ప్రధాన రహదారి రిజర్వాయర్‌ దిగువ నుంచే వెళుతుంది. దిగువనున్న కాజ్‌వే పైనుంచే గిరిజనులు ఆటోలు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలతో బయట ప్రపంచానికి వచ్చి తమ వద్ద ఉన్న పండ్లు, కూరగాయలను అమ్ముతూ వారికి కావల్సిన సరుకులను తీసుకెళుతూ ఉంటారు. అయితే, కాజ్‌వేపై వరద ఉధృతమైతే అంతే సంగతులు. ఈ నీటి ప్రవాహం వెళ్లే ప్రాంతంలో శిఖబడి గ్రామం పక్కనే ఒక మినీ వంతెన, బొమ్మిక- బీజేపురం గ్రామాల మధ్య మరో వంతెన నిర్మించారు. అదీ కూడా నాగూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నిమ్మక జయరాజు ఉన్న సమయంలో నిర్మించారు. కానీ తరువాత వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం కనీసం ఈ తూర్పు ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన మినీ వంతెన నిర్మాణం మాత్రం చేయించలేకపోయారని ఈ ప్రాంత గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పెద్దలు ఒక్కసారి మా పరిస్థితిని చూసి మినీ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చాలా అవసరం

వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన ప్రధాన రహదారిపై మినీ వంతెన ఏర్పాటు చాలా అవసరం. ఈ విషయంపై గతంలో ఎంతోమంది కలెక్టర్లకు, ప్రభుత్వ పెద్దలకు లిఖిత పూర్వకంగా లేఖలు రాసి పరిష్కరించాలని కోరాను. హామీలు ఇచ్చారు గాని కార్యరూపం దాల్చలేదు.

-నిమ్మక జయరాజు, మాజీ ఎమ్మెల్యే, కురుపాం నియోజకవర్గం

ఇబ్బందులు పడుతున్నాం

మా తూర్పు ప్రాంత ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలు వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వట్టిగెడ్డ రిజర్వాయర్‌ దిగువన వరద ఉధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. వెంటనే మినీ వంతెనకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలి.

-ఆరిక చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షులు, ఏపీ గిరిజనాభ్యుదయ సంఘం

Updated Date - Sep 19 , 2025 | 12:08 AM