ఎప్పటికి పూర్తవుతుందో?
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:56 PM
చీపురుపల్లి రైల్వే వంతెన పనులు ముందుకు సాగడం లేదు. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటుతున్నా ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
- ముందుకు సాగని చీపురుపల్లి రైల్వే వంతెన పనులు
- నాలుగేళ్లుగా నిలిచిన వాహన రాకపోకలు
- మూడు జిల్లాల ప్రజలకు తప్పని ప్రయాణ కష్టాలు
- ఆర్టీసీకి రూ.25 కోట్ల నష్టం
రాజాం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి రైల్వే వంతెన పనులు ముందుకు సాగడం లేదు. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటుతున్నా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో రాజాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా విజయనగరం, విశాఖ వెళ్లాల్సిన వారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. చీపురుపల్లిలోని జి.అగ్రహారం వద్ద రైల్వే ట్రాక్ దాటేందుకు గతంలో వంతెన ఉండేది. అయితే, ఇది వందేళ్ల కిందట నిర్మించిన వంతెన కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో 2021లో బ్రిడ్జిని పరిశీలించిన రైల్వే ఉన్నత బృందం భారీ వాహనాలు వెళ్లేందుకు ఇది అనువుగా లేదని తేల్చింది. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వంతెనపై వాహన రాకపోకలను నిలిపివేశారు. కొత్త వంతెన నిర్మాణానికి 2022 ఆగస్టు 16న రైల్వే బోర్డు రూ.12.97 కోట్లు మంజూరు చేసింది. 2023 మార్చిలో పనులు ప్రారంభించారు. రెండేళ్లు దాటుతున్నా పనుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేకుండా పోయింది.
ప్రయాణ కష్టాలు
వంతెన పనులు పూర్తికాకపోవడంతో విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా రాజాం, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు, సీతంపేట, బత్తిలి, బలద, ఒడిశాలోని గుణుపూర్, పర్లాకిమిడికి వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. కానీ, వంతెన పనులు పూర్తికాకపోవడంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పాలకొండ నుంచి విజయనగరం వెళ్లే బస్సులను గర్భాం, ఉత్తరావళ్లి మీదుగా, విశాఖ వెళ్లాల్సిన బస్సులను రాజాం, చిలకపాలెం, రణస్థలం మీదుగా తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ చార్జీల రూపంలో భారం పడడంతో పాటు ప్రయాణం మరింత దూరం అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీకి దెబ్బ..
వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఆర్టీసీకి తీరని నష్టం జరుగుతోంది. ఈ మూడేళ్లలో రూ.25 కోట్ల మేర నష్టం జరిగినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విశాఖ, విజయనగరానికి నేరుగా వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో పాలకొండ నుంచి రాజాం, చీపురుపల్లి, విజయనగరం మీదుగా 32 బస్సులు నడిచేవి. 46 ట్రిప్పులు అవి తిరిగేవి. రోజుకు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలతో గతంలో రూ.6 లక్షల ఆదాయం సమకూరేది. ప్రస్తుతం ఇటు ఉత్తరావల్లి, అటు చిలకపాలెం మీదుగా కేవలం 14 బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. గతంలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఉండేవి. ఇప్పుడు సాయంత్రం 5 గంటల తరువాత బస్సులు ఉండడం లేదు. విజయనగరం వెళ్లాల్సిన వారు చీపురుపల్లి వరకూ వెళ్తున్నారు. అక్కడ వంతెన దాటి మరో బస్సు ఎక్కుతున్నారు. గతంలో విజయనగరం నేరుగా బస్సుపై వెళితే రూ.90 చార్జీ అయ్యేది. ఇప్పుడు రూ.150 అవుతోంది. విశాఖకు గతంలో రూ.175 టిక్కెట్ ఉంటే.. ఇప్పుడు రూ.250కు చేరుకుంది. ఇప్పటికైనా రైల్వేశాఖతో పాటు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
నాలుగేళ్లుగా నరకం..
నాలుగేళ్లుగా నరకం చూస్తున్నాం. విశాఖ వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. జిల్లా కేంద్రం విజయనగరం వెళ్లాలంటే వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. సమయం అధికంగా కేటాయించాల్సి వస్తోంది. వాహన చార్జీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు వంతెన నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయాలి.
-గోడగల రవికుమార్, స్థానికుడు, రాజాం
అత్యవసర సమయాల్లో కష్టం
అత్యవసర సమయాల్లో విశాఖ వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నాం. గర్బాం, ఉత్తరావల్లి మీదుగా వెళ్లాలంటే రోడ్లు బాగాలేదు. చిలకపాలెం మీదుగా ప్రయాణం దూరం అవుతోంది. ఎన్నోరకాల అవస్థలు ఎదురవుతున్నాయి. నాలుగేళ్లుగా వంతెన నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
-కంచుపల్లి సీతంనాయుడు, స్థానికుడు, రాజాం