కల సాకారమైన వేళ
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:56 PM
కొత్త ఉపాధ్యాయుల కల సాకారమైంది. విజయవాడలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ నుంచి వారు నియామకపత్రాలు అందుకున్నారు.
- కొత్త గురువులకు నియామక పత్రాలు
- అందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
సాలూరు రూరల్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొత్త ఉపాధ్యాయుల కల సాకారమైంది. విజయవాడలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ నుంచి వారు నియామకపత్రాలు అందుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఉమ్మడి జిల్లాకు చెందిన 578మంది టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు. వీరంతా నియామక పత్రాలు అందుకునేందుకుడెంకాడ మండలం మోద వలస నుంచి బుధవారం 40 బస్సుల్లో విజయవాడకు బయల్దేరారు. తమ కల సాకారమైందని, ముఖ్యమంత్రి నుంచి నియామకపత్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని కొత్త టీచర్లు తెలిపారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు
చెప్పినట్టే సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ నిర్వహించింది. నోటిఫికేషన్ ప్రకటించిన 150 రోజుల్లో ఎంపిక జాబితాను సైతం వెల్లడించి ఈ రోజు నియామక పత్రాలందించారు. కూటమి ప్రభుత్వం చొరవతో మెగా డీఎస్సీ నిర్వహించిన దానిలో నాకు గిరిజన సంక్షేమశాఖలో తెలుగు టీజీటీగా ఉద్యోగం వచ్చింది. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లకు ధన్యవాదాలు. కుటుంబం ఇచ్చినా ఆసరాతో ఉద్యోగం సాధించాను.
- బూరగాన దుర్గాప్రసాదరావు, పార్వతీపురం
ఆనందంగా ఉంది
మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం నిర్వహించడంతో నేను టీచర్‌గా ఉద్యోగం సాధించాను. సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లకు రుణపడి ఉంటాం. కూటమి ప్రభుత్వం చెప్పినట్టే నిరుద్యోగులను ఆదుకున్నది. నా భర్త తాళ్లపూడి శ్రీరాములు నాయుడు ప్రోత్సాహాంతో ఉద్యోగం సాధించాను, ఇరువురు ఆడపిల్లలతో ఇంటి బాధ్యతలు నిర్వహిస్తునే చదివాను. కష్టపడిన దానికి ఫలితం దక్కింది. ప్రభుత్వం చెప్పిన సమయం ప్రకారం ఉద్యోగ నియామకాలు చేసింది.
-తాళ్లపూడి భారతి, గరుడబిల్లి, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా
ఎంతో సంతోషంగా ఉంది
వీరఘట్టం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉద్యోగానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని జి.రూపవతి తెలిపారు. గురువారం అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నారు. ప్రస్తుతం వీరఘట్టం మండలంలోని నడిమికెల్ల సచివాలయం సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగంపై మక్కువతో కష్టపడి చదివి పోస్టు సాధించారు.