When It Rains… They Tremble! వర్షం వస్తే.. వణుకే!
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:24 AM
When It Rains… They Tremble! వర్షం కురిస్తే చాలు.. ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వదర ఉధృతి కారణంగా కాజ్‌వేలను దాటి వారి స్వగ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. ఏటా వర్షాకాలంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వంతెనల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా.. కనీస చర్యలు శూన్యం.
ఏటా వర్షాకాలంలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
ప్రజలకు తప్పని ఇబ్బందులు
కలగా వంతెనల నిర్మాణం
గత వైసీపీ పాలనలో శంకుస్థాపనలతో సరి
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
మక్కువ రూరల్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వర్షం కురిస్తే చాలు.. ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వదర ఉధృతి కారణంగా కాజ్‌వేలను దాటి వారి స్వగ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. ఏటా వర్షాకాలంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వంతెనల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా.. కనీస చర్యలు శూన్యం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో హడావుడిగా శంకుస్థాపనలు చేసినా .. పనులు చేపట్టలేకపోయారు. మొత్తంగా వర్షం కురిసిన ప్రతిసారీ ఆయా ప్రాంతవాసులు వణికిపోవాల్సి వస్తోంది. మక్కువ మండలంలో పరిశీలిస్తే..
దుగ్గేరు సమీపంలో అడారిగెడ్డపై వంతెన నిర్మాణం కలగా మారింది. ఏళ్లు గడుస్తున్నా.. దీనిపై స్పందించే వారే కరువయ్యారు. వాస్తవంగా మక్కువ మండల కేంద్రానికి 16 కిలోమీటర్లు దూరంలో ఈ కాజ్‌వే ఉంది. దీని మీదుగా సాలూరు- మక్కువ మండలాలకు చెందిన సుమారు 20 గిరిజన గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వర్షాకాలంలో మాత్రం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కాజ్‌వేపై వరద నీరు ప్రవహించే సమయంలో మూడు రోజుల పాటు ఆయా గ్రామస్థులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అల్పపీడనం కారణంగా ఇటీల కురిసిన భారీ వర్షాలకు ఇంకా ఈ కాజ్‌వే వరద నీరు ఉధృతంగానే ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల ఇద్దరు వ్యక్తులు ఈ కాజ్‌వేను దాటబోయే క్రమంలో బైక్‌పై కొట్టుకుపోయి.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఏటా వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్న పట్టించుకునే వారే కరువయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అడారిగెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.6కోట్లు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో నిధులు రద్దయ్యాయి. తాజాగా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సమయంలో స్థానికులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నవంబరు తరువాత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం ఐటీడీఏ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో 1997-98లో సుమారు రూ.25లక్షలతో అడారిగెడ్డపై కాజ్‌వే నిర్మించారు. ప్రస్తుతం అది పూర్తిగా శిఽథిలావస్థకు చేరుకుంది. కాజ్‌వేపై వేసిన సిమెంటు రోడ్డు అధ్వానంగా మారింది. నడిచి వెళ్లడానికి కూడా వీలులేని విధంగా తయారైంది. దీంతో గిరిజనులు సొంతంగా డబ్బులు ఎత్తుకొని మే నెలలో ఆ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. మక్కువ మండలం మెండంగి, బాగుపోల, చెలకమెండంగి, ఆలగురువు, తాడిపుట్టి, బందమెండగి, గ్రామాలతో పాటు సాలూరు మండలంలో శిరివర, చింతామల, పోయిమాల, కొదమ, చోర తదితర గిరిశిఖర గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ కాజ్‌వేనే ప్రధాన మార్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడారిగెడ్డ నుంచి శిరివర వరకు రోడ్డునిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. కాగా నాలుగేళ్ల కిందట గిరిశిఖర గ్రామానికి చెందిన 55ఏళ్ల వ్యక్తి కాజ్‌వే దాటుతూ గెడ్డలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అంతకుముందు దుగ్గేరుకు చెందిన రంగారావు, దానికి రెండేళ్ల ముందు గుంటభద్రకు చెందిన బొందు అనే గిరిజనుడు కూడ ఈ గెడ్డలో కొట్టుకు పోయి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 10మంది వ్యక్తులు, 100 వరకు మూగజీవాలు గెడ్డలో కొట్టుకుపోయి మృతి చెందినట్లు ఆయా గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. తమ పంటలను సైతం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఇదిలా ఉండగా దుగ్గేరు సమీపంలో అడారిగెడ్డపై రూ.6కోట్లతో హైలెవిల్ వంతెన , గుంటభద్ర వద్ద రూ.కోటీ 50లక్షలతో మరో వంతెన నిర్మాణానికి గత వైసీపీ నాయకులు శంకుస్థాపనలు చేసి వదిలేశారు. ఈ రెండు వంతెనల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏఈ జి.శంకరావు తెలిపారు.
గోముఖి ఉప్పొంగింతే..
మక్కువకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కవిరిపల్లి వద్ద గోముఖి నదిపై కూడా వంతెన నిర్మాణం చేపట్టడం లేదు. ఏటా వర్షాకాలంలో వీఆర్‌ఎస్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తే.. ఇక్కడున్న కాజ్‌వేపైకి భారీగా వరద చేరుతుంది. దీంతో సుమారు 20 గ్రామాల ప్రజల రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఎంతోమంది గ్రామస్థులు ఈ కాజ్‌వేపై వరద ఉధృతిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు ఇంకా కాజ్‌వేపై వరద ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామస్థులు అరచేతిలో ప్రాణాలకు పెట్టుకుని స్వగ్రామాలకు చేరుతున్నారు. వాస్తవంగా 1995లో అప్పటి పార్వతీపురం ఎంపీ వైరచర్లకిషోర్‌చంద్రసూర్యనారాయణదేవ్ మంజూరు చేసిన రూ.27లక్షలతో పార్వతీపురం ఐటీడీఏ అధికారులు ఈ కాజువేను నిర్మించారు. అయితే ప్రస్తుతం దాని పిల్లర్లు శిథిలమయ్యాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. కాజ్‌వే కింద భాగం బాగా పాడైంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో కవిరిపల్లి, శంబర, ఎస్.పెద్దవలస, సన్యాసిరాజపురం పంచాయతీల్లోని 15గ్రామాలతో పాటు సాలూరు మండలంలోని మావుడి, తదితర గిరిశిఖర గ్రామస్థులకు ఏటా వర్షాకాలంలో అవస్థలు తప్పడం లేదు. జూన్ నెల నుంచి అక్టోబరు వరకు గోముఖీ నదికి వరద తాకిడి ఎక్కువైన సమయంలో మూడు, నాలుగు రోజుల పాటు ఈ కాజ్‌వేపై మీదుగా రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. ఏటా జరిగే శంబర పోలమాంబ జాతరకు 60శాతం మంది భక్తులు మక్కువ నుంచి కవిరిపల్లి మీదుగా ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. ఇంతవరకు వంతెన నిర్మాణానికి ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని మక్కువ మండల ఇంజనీరింగు అధికారి రంజిత్‌కుమార్ తెలిపారు.
ఏటా ఇబ్బందులు
దుగ్గేరు వద్ద అడారిగెడ్డపై వంతెన నిర్మించకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. రాజకీయ నాయకులు హామీలకే పరిమితమయ్యారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలి. అడారిగెడ్డపై వంతెన నిర్మిస్తే దుగ్గేరు ఏజెన్సీ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది.
- మండల గిరిధర్, ఏపీ ఆదివాసి గిరిజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి, దుగ్గేరు
===================================
నిధులు మంజూరు చేయాలి
ఏటా వర్షాకాలంలో దుగ్గేరు వద్ద అడారిగెడ్డ కాజ్‌వే దాటే క్రమంలో గిరిజనులతో పాటు పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.
కొండతామర మాలతి, గిరిజన రైతు. మెండంగి గ్రామం