When It Rains.. వర్షం కురిస్తే.. అవస్థే!
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:30 PM
When It Rains.. It’s Trouble వర్షం కురిస్తే చాలు.. పట్టణ వాసులకు అవస్థలు తప్పడం లేదు. ముంపు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో ఇక్కట్లకు గురవుతున్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై మున్సిపాల్టీ వాసులు పెదవి విరుస్తున్నారు.
వరహాలగెడ్డలో పెరిగిన వరద ఉధృతి
పార్వతీపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రకటించిన వాతావరణ శాఖ
భయాందోళనలో జిల్లాకేంద్రవాసులు
ముంపు ముప్పు తప్పించాలని విన్నపం
పార్వతీపురం టౌన్, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): వర్షం కురిస్తే చాలు.. పట్టణ వాసులకు అవస్థలు తప్పడం లేదు. ముంపు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో ఇక్కట్లకు గురవుతున్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై మున్సిపాల్టీ వాసులు పెదవి విరుస్తున్నారు. కాగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రం గుండా ప్రవహిస్తున్న వరహాలగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, వీధులు జలమయమయ్యాయి. ప్రధానంగా బైపాస్ కాలనీ, గణేష్ నగర్, సౌందర్య థియేటర్ రోడ్డు, ప్రధాన రహదారిలో వరదనీరు నిలిచింది. దీంతో అటువైపుగా పాదచారులు, వాహనచోదకులు రాకపోకలు సాగించలేకపోయారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ముంపు ముప్పు తప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- బెలగాం, పార్వతీపురం పట్టణం మీదుగా ప్రవహించే వరహాల గెడ్డ వరద ఉధృతి వల్ల గత 20 ఏళ్ల కిందట వరకు బైపాస్ కాలనీ మినహాయించి మిగతా ప్రాంతాలు, వీధులు ముంపునకు గురయ్యేవి కావు. అయితే 2010 నుంచి సీన్ మారింది. గెడ్డ పరివాహకప్రాంతమంతా ఆక్రమణలు పెరిగిపోయాయి. కాలువల నిర్మాణం కూడా అస్తవ్యస్తంగా చేపట్టడంతో ఏటా వర్షాకాలంలో ప్రజలు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. ప్రధానంగా బైపాస్ కాలనీ, ఆర్‌టీసీ కాంప్లెక్స్ , శత్రుచర్ల రియల్ ఎస్టేట్ వీధి, గణేష్ నగర్, కృష్ణ పాఠశాల వీధి, సౌందర్య ఽథియేటర్ వీధి, జనశక్తి కాలనీ, పార్వతీనగర్, తదితర కాలనీలు ముంపునకు గురవుతుంటాయి. ఇప్పటికే చుట్టు పక్కల ఉన్న చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఆయా ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉంది.
- 2010 నుంచి 2013 వరకు అయితే ప్రజలు వరద నీటిలోనే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటూ నరకం చూశారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వరహాల గెడ్డలో పూడికల తొలగింపునకు చర్యలు చేపట్టారు. సుమారు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూడికలతీత తూతూమంత్రంగా సాగింది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడం అనేది కాగితాలకే పరిమితమైంది. కాగా ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాటి పరిస్థితి మళ్లీ పునరావృతమవుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఏటా వర్షాకాలంలో ఎక్కడికక్కడే రోజుల తరబడి మురుగు, వరదనీరు నిలిచిపోవడంవల్ల నివాసితులు మలేరియా, డయేరియా, డెంగ్యూ, జ్వరాలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించకపోవడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
. భయమేస్తోంది..
విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వరహాల గెడ్డలో నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో ఎక్కడ ముంపునకు గురవుతామోనని భయం వేస్తోంది. శాశ్వత ప్రాతిపదికన బైపాస్ కాలనీలో ముంపు సమస్యను పరిష్కరించాలి.
- ఎం. రమణ, బైపాస్ కాలనీ, పార్వతీపురం
===================================
ఆక్రమణలపై దృష్టి సారించాలి
వరహాల గెడ్డకు ఆనుకుని ఉన్న ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించాలి. ప్రజల్లో ముంపు భయాన్ని పోగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
- పి.సన్యాసిరావు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు
===================================
యుద్ధప్రాతిపదికన చర్యలు
రానున్న రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవ్వకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతాం. వరహాల గెడ్డలో నీటి ప్రవాహం పెరిగినప్పటికీ బైపాస్ కాలనీ, గణేష్ నగర్‌తో పాటు తదితర లోతట్టు ప్రాంతాలు, వీధుల్లోకి వరద వెళ్లకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తాం.
- శ్రీనివాసరావు, ఇన్‌చార్జి కమిషనర్, పార్వతీపురం మున్సిపాల్టీ