'Unnati'? ‘ఉన్నతి’ ఎప్పుడు?
ABN , Publish Date - May 09 , 2025 | 11:37 PM
When is 'Unnati'? జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘాలు ఉన్నతి రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఏటా ఏప్రిల్ నెలలో ఉన్నతి పథకాన్ని రెన్యూవల్ చేస్తూ నిధులు విడుదల చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘాల సభ్యులు వాటి కోసం నిరీక్షిస్తున్నారు.

నిధుల కేటాయింపు పెంచాలని విన్నపం
జియ్యమ్మవలస, మే 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘాలు ఉన్నతి రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఏటా ఏప్రిల్ నెలలో ఉన్నతి పథకాన్ని రెన్యూవల్ చేస్తూ నిధులు విడుదల చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘాల సభ్యులు వాటి కోసం నిరీక్షిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించి.. తద్వారా వారి జీవనోపాధి మెరుగుపర్చడమే ఉన్నతి పథకం ప్రధాన లక్ష్యం. కాగా జిల్లాలోని 15 మండలాల పరిధిలో 565 వరకు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మొత్తం 19,846 మహిళా సంఘాల్లో 2,25,976 మంది సభ్యులు ఉన్నారు. వాటిల్లో 2,298 ఎస్సీ సంఘాల్లో 29,038 మంది సభ్యులు, 4,756 ఎస్టీ మహిళా సంఘాల్లో 64,799 మంది సభ్యులు ఉన్నారు. అత్యధికంగా వీరఘట్టం మండలంలోని 46గ్రామైక్య సంఘాలు ఉండగా 1,756 మహిళా సంఘాలు, అందులో 18,960 మంది మహిళా సభ్యులు ఉన్నారు. అతి తక్కువగా గుమ్మలక్ష్మీపురం మండలంలో 31 గ్రామైక్య సంఘాలు , వాటి పరిధిలో 1,046 మహిళా సంఘాలు, అందులో 12,291 మహిళా సభ్యులు ఉన్నారు.
ప్రతిపాదనలు ఇలా..
ఉన్నతి పథకం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే డీఆర్డీఏ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో మహిళకు రూ. 50 వేలు చొప్పున అందించేం దుకు రంగం సిద్ధం చేశారు. షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్ (ఎస్సీఎస్పీ) మండలాల్లో 441 మంది కోసం రూ. 2.20 కోట్లతో , ట్రైబల్ సబ్‌ప్లాన్ (టీఎస్పీ) మండలాల్లో ఉన్న 744 మంది గిరిజన మహిళలకు రూ.3.72 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇది చాలదని కొందరు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. గతంలో రూ. 50 వేలు తీసుకొని రుణం తీర్చేసిన వారు లక్ష రూపాయలు ఇవ్వాలంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతి పథకం త్వరగా నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు.
త్వరలో విడుదలవుతాయి
ఎస్సీ, ఎస్టీ మహిళా సంఘాల ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే నిధులు విడుదలవుతాయి. మండలాల వారీగా పంపిణీ చేస్తాం.
- సుధారాణి, డీఆర్డీఏ పీడీ, పార్వతీపురం మన్యం