Share News

Tidco:టిడ్కో ఎప్పుడో?

ABN , Publish Date - May 13 , 2025 | 11:20 PM

Tidco:టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఏళ్ల తరబడి ఎదురుచూపు తప్పడం లేదు.

 Tidco:టిడ్కో ఎప్పుడో?
రాజాం సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు

- ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

- కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని వినతి

రాజాం, మే 13 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఏళ్ల తరబడి ఎదురుచూపు తప్పడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ పేదల కోసం టిడ్కో ఇళ్లను నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో 60 నుంచి 90 శాతం పనులు పూర్తిచేశారు. ఇంతలో 2019లో అధికార మార్పిడి జరిగింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌ పనులపై దృష్టిపెడుతుందని అంతా భావించారు. కానీ, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసిన జగన్‌ సర్కారు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు మొగ్గుచూపలేదు. టిడ్కో గృహాల ప్రాంగణంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. కానీ, వైసీపీ రంగులతో ఇళ్లను నింపేశారు. సరిగ్గా గత ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించారు. అయితే, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ఆ ఇళ్లలోకి వెళ్లేందుకు లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్లకు అద్దెలు చెల్లిస్తున్నారు. అదే సమయంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాల ఈఎంఐలు కడుతున్నారు. దీంతో లబ్ధిదారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.


జిల్లాలో పరిస్థితి..

విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించి సారిపల్లిలో 2,880 ఇళ్లు మంజూరయ్యాయి. వివిధ కారణాలతో 2,656 ఇళ్ల నిర్మాణ పనులు జరిగాయి. 82 బ్లాకుల్లో 32 ప్లాట్లలో 300 చదరపు అడుగుల గృహాలు 1536, 365 చదరపు అడుగుల ఇళ్లు 192, 430 చదరపు అడుగుల ఇళ్లు 928 ఉన్నాయి. తొలి ఫేజ్‌లో 2,656 గృహాలను నాలుగు విడతల్లో అప్పగించారు. సోనియా నగర్‌లో 1280 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 1120 గృహాల పనులు పూర్తయ్యాయి. ఇందులో 300 చదరపు అడుగులవి 480, 365 చదరపు అడుగులవి 256, 430 చదరపు అడుగుల ఇళ్లు 384 ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 91 శాతం పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతులకల్పన పనులు 15 శాతం జరిగాయి. అయితే, గత ఐదేళ్లలో రహదారులు, కాలువలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివి నిర్మించాల్సి ఉన్నా.. జగన్‌ సర్కారు పట్టించుకోలేదు.

- బొబ్బిలి పట్టణానికి సంబంధించి రామన్నదొరవలస వద్ద టిడ్కో గృహాలను మంజూరు చేశారు. ఇక్కడ 35 బ్లాకుల్లో 1,680 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 1200 గృహాలకు సంబంధించి లాటరీ తీసి లబ్ధిదారులకు అందజేశారు. అయితే, ఇంతవరకూ ప్రాంగణంలో మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో లబ్ధిదారులు అక్కడకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడంతో పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. ఒక ఏజెన్సీకి పనులు అప్పగించడం, బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో మౌలిక వసతులకు సంబంధించిన పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

- రాజాం మునిసిపాల్టీకి సంబంధించి కంచారంలో 336 ఇళ్లను నిర్మించేందుకు నిర్ణయించారు. కానీ, అప్పట్లో వివిధ కారణాలు చూపి పనులు ప్రారంభించలేదు. వైసీపీ ప్రభుత్వం థర్డ్‌ పార్టీగా చూపి ఒక ఏజెన్సీకి పనులు అప్పగించింది. కానీ ఆ ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ప్రారంభించలేదు.

- నెల్లిమర్ల నగర పంచాయతీలోనూ అదే పరిస్థితి. 576 ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. సంబంధిత ఏజెన్సీ పనులు ప్రారంభించలేదు. నెల్లిమర్లతో పాటు రాజాంలో భవనాల నిర్మాణం చేపట్టాలి. అటు మౌలిక వసతులు కల్పించాలి.


కాంట్రాక్టర్ల విముఖత..

ప్రస్తుతం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.40 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరో రూ.89 కోట్లు మంజూరైతే కానీ భవనాల పనులు ముందుకు కదలని పరిస్థితి. దీనినే జిల్లా అధికారులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో ఇళ్ల విషయంలో కదలిక వచ్చింది. కొద్దిపాటి మౌలిక వసతులు అవసరమైన వాటిని గుర్తించారు. అక్కడ అభివృద్ధి పనులకుగాను రూ.58.50 కోట్లు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే బ్యాంకు రుణాలతో అప్పట్లో టిడ్కో ఇళ్లను మంజూరు చేశారు. 24 మారిటోరియంకు గడువు ముగియడంతో ఇప్పుడు బ్యాంకులకు రుణాల చెల్లింపులు ప్రారంభమయ్యాయి, ఒక్కో లబ్ధిదారుడు రూ.4 వేలకు తగ్గకుండా ఈఎంఐలు చెల్లించాలి. దీనికితోడు ఇప్పుడున్న ఇళ్లకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు చాలా బాధపడుతున్నారు. వీలైనంత త్వరగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని.. మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నివేదిక పంపించాం

టిడ్కో ఇళ్లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపాం. అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు రూ.129 కోట్లు అవసరమని గుర్తించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.

-శశిధర్‌, టిడ్కో డీఈఈ, విజయనగరం

Updated Date - May 13 , 2025 | 11:20 PM