When did those PACS committees come into being? ఆ పీఏసీఎస్‌లకు కమిటీలు ఎప్పుడో?
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:56 PM
When did those PACS committees come into being? నెల్లిమర్ల నియోజకవర్గ కూటమిలో పొడచూసిన విభేదాలు సమసిపోవడం లేదు. నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏ అంశంలోనూ ఏకాభిప్రాయానికి రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచీ ఇదే పరిస్థితి. ఆ ప్రభావం పీఏసీఎస్‌లపై బలంగా పడింది.
ఆ పీఏసీఎస్‌లకు
కమిటీలు ఎప్పుడో?
నెల్లిమర్ల కూటమిలో కొనసాగుతున్న విభేదాలు!
జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్‌ల నియామకం
ఆ నాలుగు మండలాల్లోనే పెండింగ్
ఇప్పటికీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్‌చార్జి
విజయనగరం, సెప్టెంబరు6(ఆంధ్రజ్యోతి):
నెల్లిమర్ల నియోజకవర్గ కూటమిలో పొడచూసిన విభేదాలు సమసిపోవడం లేదు. నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఏ అంశంలోనూ ఏకాభిప్రాయానికి రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచీ ఇదే పరిస్థితి. ఆ ప్రభావం పీఏసీఎస్‌లపై బలంగా పడింది. జిల్లా అంతటా కమిటీలు ఏర్పాటైనా ఇక్కడ మాత్రం జాబితాలు కొలిక్కి రావడం లేదు. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి వర్సెస్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నట్టు మనస్పర్థలు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఉండగా పొత్తులో భాగంగా సాధారణ ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు టిక్కెట్ దక్కింది. టీడీపీ సహకారంతో ఎమ్మెల్యేగా నాగమాధవి గెలిచారు. అయితే ఆదినుంచి ఎమ్మెల్యేకు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జికి మధ్య సమన్వయం లేదు. ఓ సమావేశంలో ఇద్దరూ తీవ్ర వాదనలకు దిగిన విషయం తెలిసిందే. తర్వాత ఇరు పార్టీల పెద్దల సూచనతో బహిరంగ గొడవలు లేనప్పటికీ అంతర్గంతంగా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. దీనివల్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌లు)కు కమిటీల ఎంపిక జరగలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలను నియమించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పెండింగ్‌లో ఉంచారు.
టీడీపీకి కంచుకోట అయినా..
నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట. అంతకుముందు సతివాడ నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ ప్రతిసారీ ఆ పార్టీ అభ్యర్థే గెలుపొందుతూ వచ్చారు. నెల్లిమర్లగా రూపాంతరం చెందిన తరువాత కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ, టీడీపీలు చెరోసారి గెలిచాయి. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా లోకం నాగమాధవి పోటీచేసి గెలిచారు. అయితే అప్పటికే అక్కడ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ రాష్ట్రస్థాయిలో పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ కేటాయించడంతో బంగార్రాజు మనస్తాపానికి గురయ్యారు. పార్టీ అధినేత సముదాయించడంతో మెత్తబడ్డారు. నాగమాధవి గెలుపునకు కృషిచేశారు.
ఆది నుంచీ..
ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. బంగార్రాజుకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కాక ప్రొటోకాల్ వివాదం మొదలైంది. నెల్లిమర్ల మునిసిపల్ సమావేశానికి బంగార్రాజు హాజరైతే.. ఏ హోదాలో వచ్చారని ఎమ్మెల్యే నాగమాధవి ప్రశ్నించారు. ఆ సమయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగాక ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఇరు పార్టీల అధినాయకత్వాల దృష్టికి వెళ్లడంతో ఇద్దరికీ పిలుపు వచ్చింది. వారిని సముదాయించి సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టే ఉన్నారు.
- డెంకాడ మండలంలో డెంకాడ, జొన్నాడలో పీఏసీఎస్‌లు ఉన్నాయి. జొన్నాడ పీఏసీఎస్ జనసేన ఖాతాలోకి వెళ్లిందని అంటున్నారు కానీ ఇంకా స్పష్టత లేదు. డెంకాడ విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నా కొలిక్కి రాలేదు.
- నెల్లిమర్ల మండలంలో మూడు పీఏసీఎస్‌ల ఉన్నాయి. మొయిద, సతివాడ, తుమ్మలపేట పీఏసీఎస్‌ల్లో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వారి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు.
- భోగాపురం మండలంలో రెండు పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇరుపార్టీలు పోటీపడుతున్నాయి. పోలిపల్లి, భోగాపురం పీఏసీఎస్‌కు సంబంధించి ఇరుపార్టీల నాయకులు వారి అనుచర వర్గానికి చెందిన పేర్లను ప్రతిపాదిస్తూ అమరావతికి పంపించారు. అక్కడి నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
- పూసపాటిరేగ మండలంలో వెంపడాం,పూసపాటిరేగ, లంకలపల్లిపాలెం, కుమిలి వద్ద పీఏసీఎస్‌లు ఉన్నాయి. నాలుగు చోట్ల ఇరుపార్టీలనుంచి ఎనిమిది మంది ఆసక్తి చూపుతున్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు.
------------