కటాఫ్ ఎంత?
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:09 AM
What’s the Cut-off? మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదలైన నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు కటాఫ్ మార్కులు ఎన్ని ఉండొచ్చననే ఉత్కంఠలో అభ్యర్థులు ఉన్నారు. దీనిపై ఎవరికి వారు అంచనా వేసుకుంటూ.. వాకబు చేస్తున్నారు.
కాల్ లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
సాలూరు రూరల్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి ): మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదలైన నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఎంపికకు కటాఫ్ మార్కులు ఎన్ని ఉండొచ్చననే ఉత్కంఠలో అభ్యర్థులు ఉన్నారు. దీనిపై ఎవరికి వారు అంచనా వేసుకుంటూ.. వాకబు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఓసీకి 84.71 మార్కులు, ఓసీ ఈడబ్ల్యూఎస్ 73.11, బీసీ-ఏ 80.64, బీసీ-బీ 80.81, బీసీ-సీ 67.33, బీసీ-డీ 83.98, బీసీ-ఈ 64.39, ఎస్సీలకు 82.91 నుంచి 78.34, ఎస్టీలకు 74.38 వరకు మార్కుల కటాఫ్ ఉండొచ్చని భావిస్తున్నారు. నాన్ లోకల్‌లో సైతం కటాఫ్ అత్యధిక మార్కులు ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీనిపై ఈ నెల 26 మధ్యాహ్నం స్పష్టత రానుంది. కాగా ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరీల్లో 583 పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెలలో వారంతా విధుల్లో చేరే అవకాశం ఉంది. మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులు బోధించనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం మెగా డీఎస్సీ మెరిట్‌లిస్ట్‌లో జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌కు కాల్‌లెటర్లు పంపుతారు. వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉన్న సూచనలు పాటించాలి. వారికి కేటాయించిన తేదీ, సమయానికి ద్రువపత్రాల పరిశీలనకు తప్పకుండా హాజరుకావాల్సి ఉంది. పోస్టులకు ఎంపిక పూర్తిగా ప్రతిభ, అర్హత, నియమ నిబంధనలకు ఆధారంగా జరుగుతుందని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం రాత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 12 బృందాలను ఏర్పాటు చేసే అవకాశముంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి 24 మంది బృందం విజయవాడలో శిక్షణ పొందింది. డెంకాడ మండలం మోదవలస ఓయో ఇంటర్నేషనల్ స్కూల్‌లో 28న ఉదయం తొమ్మిది గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని విజయనగరం డీఈవో మాణిక్యాలనాయుడు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చిన వారంతా పోస్టుకు ఎంపికైనట్టు కాదన్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.