Share News

What is the timeline? సమయపాలనేది?

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:59 PM

What is the timeline?సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఎక్కువ మంది సకాలంలో విధులకు హాజరుకావడం లేదు.. వచ్చినా క్షేత్రస్థాయి విధులకు అంటూ థంబ్‌ వేసి బయటకు వెళ్లిపోతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం జిల్లా వ్యాప్తంగా చేసిన విజిట్‌లో ఈ అంశం ప్రధానంగా కనిపించింది. అనేక ఇతర విషయాలూ వెలుగు చూశాయి.

What is the timeline? సమయపాలనేది?
బొబ్బిలి: అప్పయ్యపేట సచివాలయంలో ఖాళీగా కుర్చీలు

సమయపాలనేది?

ఫీల్డ్‌ విజిట్‌ నెపంతో సకాలంలో విధులకు రాని సచివాలయ ఉద్యోగులు

ఉదయం 11 తరువాతే హాజరు

ఎప్పుడూ ఖాళీగా కుర్చీలు

ప్రజలకు తప్పని నిరీక్షణ

ఇంకా గాడినపడని సచివాలయ వ్యవస్థ

విజయనగరం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి):

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఎక్కువ మంది సకాలంలో విధులకు హాజరుకావడం లేదు.. వచ్చినా క్షేత్రస్థాయి విధులకు అంటూ థంబ్‌ వేసి బయటకు వెళ్లిపోతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం జిల్లా వ్యాప్తంగా చేసిన విజిట్‌లో ఈ అంశం ప్రధానంగా కనిపించింది. అనేక ఇతర విషయాలూ వెలుగు చూశాయి. కార్యాలయాల నిర్వహణ సైతం బాగాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సచివాలయాల్లో పని విభజన చేసింది. జనాభాను అనుసరించి ఉద్యోగులను నియమించింది. దీంతో పని సర్దుబాటు కొంతవరకూ జరిగింది కానీ సాంకేతిక సమస్యలు, కార్యాలయాల నిర్వహణ గాడిలో పడలేదు. పర్యవేక్షణ కూడా ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఉద్యోగుల సమయపాలన సరిగా లేదు. కార్యాలయ పనుల్లో కొంత నిర్లిప్తత కనిపిస్తోంది.

ఉమ్మడి జిల్లాలోని 34 మండలాల్లో 778 గ్రామ/వార్డు సచివాలయాలు కొనసాగుతున్నాయి. 6,178 మంది ఉద్యోగులను నియమించగా ప్రస్తుతం 5,452 మంది విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జనాభా ఆధారంగా సచివాయాలను మూడు కేటగిరీల్లో విభజన చేశారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాన్ని ఏ కేటగిరిలో చేర్చి ఆరుగురు ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 2500 నుంచి 3,000 మంది జనాభా ఉన్న సచివాలయాన్ని బీ కేటగిరిలో చేర్చి ఏడుగురు ఉద్యోగులను, మూడు వేలపైబడి జనాభా ఉన్న సచివాలయాన్ని సీ విభాగంలో చేర్చి 8 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆపై 1000 మందికిపైగా మిగులు ఉద్యోగులు ఉన్నట్లు తేల్చారు. అయితే కొన్ని శాఖల్లో లోటు ఉండగా.. మరికొన్ని శాఖల్లో మిగులు సిబ్బంది ఉన్నారు.

ఫీల్డ్‌ స్టాఫ్‌ అధికం..

సచివాలయాల్లో ఎక్కువగా క్షేత్రస్థాయి విధులు నిర్వహించాల్సిన కార్యదర్శులే ఉన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ మాత్రమే కార్యాలయంలో ఉండాలి. అయితే క్షేత్రస్థాయి విధుల పేర్లు చెప్పి చాలా మంది కార్యాలయానికి డుమ్మా కొడుతున్నట్టు కూడా విమర్శలున్నాయి. ఇటీవల సచివాలయ ఉద్యోగులను పక్క మండలాలకు బదిలీ చేసిన తరువాత సమయపాలన మరింత గాడి తప్పినట్టు కనిపిస్తోంది.

బెల్ట్‌షాపులు పట్టని మహిళా పోలీసులు

సచివాలయాల పరిధిలో నేరాలు, గొడవలు, బెల్టుషాపులు, సార విక్రయాలు, గంజాయి వాడకం వంటి నేరాలకు పాల్పడితే మహిళా పోలీసులు ఆ సమాచారం వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలి. కానీ సచివాలయం పక్కనే బెల్టుషాపులు నడుస్తున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఆకతాయిలను అదుపు చేయడం లేదు. చట్టాలపై అవగాహన శిబిరాలు నిర్వహించడం లేదు.

అవగాహన సదస్సులేవి?

రాష్ట్ర ప్రభ్వుం ప్రతిష్టాత్మకంగా సేవలందిస్తున్న వాట్సాప్‌ గవర్నన్సీ సేవలు అందరికీ అందేలా సచివాలయాల సిబ్బంది ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం అదేశించింది. కానీ ఆ విధంగా చేయడం లేదు. అవగాహన లేక కొంతమంది ఇప్పటికీ మీ సేవ సెంటర్ల వద్దకు వెళ్లి పనులు చేయించుకుంటున్నారు.

నిర్వహణ భారమే..

సచివాలయ కార్యాలయాల నిర్వహణ భారంగా మారుతోంది. ఇప్పటికీ వందలాది సచివాయాలకు సొంత భవనాలు సమకూరలేదు. ఇరుకు గదులు, అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. స్టేషనరీ ఖర్చు కేటాయించడం లేదు. ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి. కొన్ని భవనాల్లో మరుగుదొడ్లు కూడా లేవు. దీంతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులకు అసౌకర్యం తప్పడం లేదు. కార్యాలయ నిర్వహణకు సంబంధించి స్వీపర్‌ ఖర్చులు ఉద్యోగులే పెట్టుకుంటున్నారు. నెట్‌ పనిచేయకపోతే మొబైల్‌ హాట్‌స్పాట్‌ల ద్వారా పనిచేయాల్సి వస్తోంది.

ఆదేశాలు పాటించాల్సిందే

సచివాలయ ఉద్యోగులు విధిగా సమయపాలన పాటించాలి. సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సి వస్తే తప్పకుండా అడ్మిన్‌ లేదా కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇటీవల జాబ్‌ చార్టును సైతం విడుదల చేసింది. దాని ప్రకారమే నడుచుకోవాలి.

- ఎస్‌.రోజారాణి, జిల్లా కోఆర్డినేటర్‌, గ్రామవార్డు సచివాలయ శాఖ

10.30కు వచ్చింది అరకొరే

రాజాం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అప్పుడు సమయం సోమవారం ఉదయం 10 గంటలైంది. రాజాం మండలం కంచరాం-1, కంచరాం-2 సచివాలయాలను ‘ఆంధ్రజ్యోతి’ సందర్శించగా 16 మంది సచివాలయ ఉద్యోగులకుగాను కేవలం ఇద్దరు మాత్రమే విధులకు హాజరయ్యారు. 10.20కు ఇద్దరు.. 10.30కు ముగ్గురు వచ్చారు. 10.45 గంటలకు మరో ముగ్గురు వచ్చారు. 11.00 గంటలకు ఇద్దరు వచ్చారు. ఇలా సమయపాలన ఏదీ కనిపించలేదు.

సచివాలయంలో ప్రైవేటు వ్యక్తి

రేగిడి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సంకిలి సచివాలయాన్ని ఆంధ్రజ్యోతి సోమవారం ఉదయం 11.10 నిమిషాలకు సందర్శించగా ప్రైవేటు వ్యక్తి విధుల్లో ఉండడం కనిపించింది. డిజిటల్‌ అసిస్టెంట్‌ పక్క గదిలో ఆధార్‌డ్రైవ్‌లో ఉండగా ఆమె కుర్చీలో ఓ ప్రైవేటు వ్యక్తి విధుల్లో ఉన్నాడు. కారణమేంటని అడిగితే సిబ్బంది కొరత అని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చెప్పడం విశేషం. ప్రైవేటు వ్యక్తికి సచివాలయ పాస్‌వర్డు, లాగిన్‌లు ఇచ్చి సేవలు అందించడం గమనార్హం.

కుర్చీలన్నీ ఖాళీ

బొబ్బిలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణ పరిధిలోని అప్పయ్యపేట, రావువారివీధి సచివాలయాలను సోమవారం ఆంధ్రజ్యోతి సందర్శించగా డిజిటల్‌ అసిస్టెంట్‌ తప్ప ఇతర ఏ ఉద్యోగులు కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పయ్యపేట సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. రావు వారివీధి సచివాలయంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ డిజిటల్‌ అసిస్టెంట్‌ మాత్రమే కనిపించారు.

మొక్కుబడిగా మూమెంట్‌ రిజిస్టర్‌

గంట్యాడ, నవంబరు 12(ఆంరఽధజ్యోతి): నరవ గ్రామ సచివాలయాన్ని ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య ఆంధ్రజ్యోతి పరిశీలించగా ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌లు మాత్రమే ఉన్నారు. మూమెంట్‌ రిజిస్టర్‌లో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మాత్రమే నందాం గ్రామానికి వెళ్లినట్లు రాసి ఉంది.

రిజిస్టర్‌లో సంతకాలేవి?

దత్తిరాజేరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కోరపుకృష్ణాపురం, కోరపుకొత్తవలస సచివాలయాలను సోమవారం ఉదయం 10నుంచి 11 గంటల మధ్య ‘ఆంధ్రజ్యోతి’ సందర్శించింది. కోరపు కృష్ణాపురంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, కోరపుకొత్తవలస సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం మాత్రమే కనిపించారు. మిగతా వారు రాలేదు. కనీసం రిజిస్టర్‌లో సంతకాలు కూడా చేయలేదు. కృష్ణాపురం సచివాలయంలో సిబ్బంది కోసం గ్రామస్థులు చాలా సేపు నిరీక్షించారు.

Updated Date - Nov 12 , 2025 | 11:59 PM