యంత్రాంగం ఏం చేస్తోంది?
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:16 AM
జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వైద్యా ఆరోగ్య శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వైద్యా ఆరోగ్య శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా మెటర్నల్, చైల్డ్ డెత్ సర్వేలెన్స్ రెస్పాన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ రక్షణ కోసమే యంత్రాంగం ఉందని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొన్ని మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెప్పారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు.
- గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. పారిశుధ్యం, ఉపాధి పనులపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని, నీటిని ఎప్పటికప్పుడు పరిరక్షించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో వెనుకబడి ఉన్న మండలాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ నెలాఖరులోగా పురోగతి సాధించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రామికుల నుంచి పని కోసం దరఖాస్తులను స్వీకరించాలని, ఈకేవైసీ లోపాలు కారణంగా రద్దయిన జాబ్‌కార్డులను పునఃపరిశీలించి, అర్హులైన వారి కార్డులను పునరుద్ధరించాలని ఆదేశించారు.
పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. మొట్టమొదటి ఏరోడ్రోమ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఏఈఎంసీ) సమావేశాన్ని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. ప్రకృతికి అనుకూలంగా, సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పది కిలో మీటర్ల పరిఽధిలో పక్షి ప్రమాదం లేని ప్రాంతాన్ని సృష్టించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక పరిపాలన యంత్రాంగానికి, విమానాశ్రయ నిర్వహణ సంస్థకు మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు. పర్యావరణ భద్రత, నిర్వహణలో భోగాపురం విమానాశ్రయాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లక్కీ వర్మ భాస్కర్, ప్రాజెక్టు హెడ్ బీహెచ్‌ఏ రామరాజు, పర్యావరణ నిపుణులు ఏజేడీ కార్తీక్, వన్య ప్రాణి రక్షణ నిపుణులు బిభూ పాండే, ఆర్డీవో కీర్తి తదితరులు పాల్గొన్నారు.