what is situation of those 565 buildings! ఆ 565 భవనాల పరిస్థితేంటో!
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:45 PM
what is situation of those 565 buildings! గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలుగా ఉన్న సచివాలయాలు, ఆర్‌ఎస్‌కేలకు చాలా చోట్ల నీడ లేదు. భవన నిర్మాణం అప్పట్లోనే చేపట్టినప్పటికీ పూర్తికాలేదు. బిల్లులు కూడా నాటి ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. పూర్తయిన చోట్ల కూడా బిల్లులు అందక వారు భవనాలను అప్పగించలేదు. వెల్‌నెస్ కేంద్రాలదీ అదే పరిస్థితి. ఇక డిజిటల్ గ్రంథాలయాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
ఆ 565 భవనాల పరిస్థితేంటో!
జిల్లాలో అసంపూర్తిగా సచివాలయాలు, ఆర్‌ఎస్‌కేలు
వెల్‌నెస్ కేంద్రాలదీ అదే పరిస్థితి
జాడలేని డిజిటల్ గ్రంథాలయాలు
పూర్తి చేయాలంటే రూ.320 కోట్లు అవసరం
గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలుగా ఉన్న సచివాలయాలు, ఆర్‌ఎస్‌కేలకు చాలా చోట్ల నీడ లేదు. భవన నిర్మాణం అప్పట్లోనే చేపట్టినప్పటికీ పూర్తికాలేదు. బిల్లులు కూడా నాటి ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. పూర్తయిన చోట్ల కూడా బిల్లులు అందక వారు భవనాలను అప్పగించలేదు. వెల్‌నెస్ కేంద్రాలదీ అదే పరిస్థితి. ఇక డిజిటల్ గ్రంథాలయాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.
రాజాం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):
ప్రజల చెంతకు ప్రభుత్వ సేవలను తీసుకొస్తున్నామంటూ నాడు వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. అంతే వేగంగా భవన నిర్మాణం కూడా చేపట్టింది. కానీ బిల్లుల చెల్లింపులో ఆ స్పీడ్ లేదు. దీంతో భవనాల నిర్మాణం ఆదిలోనే పడకేసింది. ఆ ప్రభుత్వం ముగిసిన సమయానికి కొన్ని భవనాలే పూర్తయ్యాయి. జిల్లాలో సచివాలయాలు, రైతుసేవా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు కలిపి 1461 మంజూరయ్యాయి. అందులో పూర్తయినవి 896 మాత్రమే. మిగతా 565 భవనాలు మధ్యలో ఉండిపోయాయి. పునాదులు, లింటల్, స్లాబ్ స్థాయిల్లో అవి కనిపిస్తున్నాయి. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే వాటి పనులు చేపట్టింది వైసీపీ నేతలే. ఆ ప్రభుత్వం చెల్లింపులు చేయలేదు. దీంతో సొంత ప్రభుత్వంపైనే అప్పట్లో నేతలు ఆవేదనతో ఉండేవారు. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లులను విడతలవారీగా చెల్లిస్తున్నా పనులు పూర్తిచేసేందుకు వారు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇందుకు రకరకాల కారణాలు లేకపోలేదు. కాంట్రాక్టర్లుగా ఉన్న ఆ నేతలు ప్రతిపక్షంలో ఉండడంతో పనులు చేస్తే బిల్లులు చెల్లిస్తారో లేదో అన్న అనుమానం వారికి కలుగుతోంది. ఇదిలా ఉండగా కొన్ని భవనాలు పూర్తికాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. నిర్వహణ లేక.. తక్షణం చేయాల్సిన పనులు చేయకుండా వాటిని వదిలేశారు. గోడలకు ప్లాస్టింగ్ చేయకపోవడంతో అవి వర్షాలకు నానిపోయి పట్టుతప్పుతున్నాయి. ఆకతాయిలు వాటిలోకి ప్రవేశించి అధ్వానంగా మారుస్తున్నారు. ఇంకోవైపు ఆయా సచివాలయాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తుండడంతో ప్రభుత్వానికి అద్దె భారం తప్పడం లేదు. మధ్యలో నిలిచిపోయిన సచివాలయాలు, ఆర్‌ఎస్‌కేల భవనాలు పూర్తి చేయాలంటే రూ.320 కోట్లు అవసరం. కొన్నిచోట్ల బిల్లులు చెల్లించక భవనాలను అప్పగించలేదు. ఇంకొన్ని కోర్టు వివాదాల్లో ఉన్నాయి. డిజిటల్ గ్రంథాలయాలు, బల్క్‌మిల్కు కేంద్రాల భవన నిర్మాణం జరగలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 అక్టోబరు 2న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామస్థాయిలో అన్నిరకాల ప్రభుత్వ సేవలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. గ్రామ సచివాలయాలు 530కుగాను 396 పూర్తయ్యాయి. రైతుసేవా కేంద్రాలు 396లో పూర్తయినవి 305 కాగా వెల్‌నెస్ సెంటర్లు 435కుగాను 196 పూర్తయ్యాయి. వాస్తవానికి ఈ భవనాలను కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధుల సహకారంతో నిర్మించతలపెట్టారు. ఒక్కో సచివాలయానికి రూ.45 లక్షలు, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్ కేంద్రాలు, డిజిటల్ గ్రంథాయాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.25 లక్షలు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం నిధుల మంజూరును పట్టించుకోలేదు. ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడుతోంది.
త్వరలో పూర్తిచేస్తాం
సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలకు సంబంధించి భవనాల నిర్మాణం పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే పెండింగ్ బకాయిలను సైతం చెల్లించింది. నిర్మాణాలు పూర్తిచేసిన వాటిని అందుబాటులోకి తీసుకొస్తాం. వీలైనంత త్వరగా భవన నిర్మాణాలన్నీ పూర్తయ్యేలా చేస్తాం.
- శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ, విజయనగరం