Share News

What is really happening? అసలేం జరుగుతోంది?

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:41 PM

What is really happening? తహసీల్దార్‌ కార్యాలయాలకు తరచూ ఎవరెవరు వస్తున్నారు? ఏమేమి చేస్తున్నారు.. భూముల లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? తహసీల్దార్‌లకు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం.

What is really happening? అసలేం జరుగుతోంది?

అసలేం జరుగుతోంది?

తహసీల్దార్‌ కార్యాలయాలపై నిఘా

లోతుగా ఆరా తీస్తున్న ఉన్నతాధికారులు

కొత్తవలస తహసీల్దార్‌ సస్పెన్షన్‌తో కలకలం

మిగతా వారిలోనూ కలవరం

కొత్తవలస, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయాలకు తరచూ ఎవరెవరు వస్తున్నారు? ఏమేమి చేస్తున్నారు.. భూముల లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? తహసీల్దార్‌లకు ఎవరెవరు సహకారం అందిస్తున్నారు? తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా భూములను మార్పులు చేస్తే ఊరుకునేది లేదని కొందరిని ఉన్నతాధికారులు ప్రాథమికంగా హెచ్చరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో కొత్తవలస తహసీల్దార్‌ సస్పెన్షన్‌ అంశం కూడా రెవెన్యూలో కలకలం సృష్టిస్తోంది. మిగతా వారిలో కలవరం నెలకొంది.

కొత్తవలస తహసీల్దార్‌గా పి.అప్పలరాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరోపణలు వచ్చాయి. ఆయన కొన్ని అంశాలలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు గుర్తించారని సమాచారం. మిగతా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలపైనా ఓ కన్ను వేసి ఉంచారని తెలుస్తోంది. కలెక్టర్‌గా రామసుందర్‌ రెడ్డి వచ్చాక భూములు వ్యవహారాలపై నిఘా పెరిగింది. ఇందులో భాగంగానే కొత్తవలస తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేసి మిగిలిన తహసీల్దార్‌లకు హెచ్చరికలను పంపారని సమాచారం.

కొత్తవలస తహసీల్దార్‌ ఆ మండలంలోని చిన్నిపాలెం గ్రామానికి చెందిన సర్వేనెంబర్‌ 95లో 10 ఎకరాల 30 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న చెరువును సబ్‌ డివిజన్‌ చేసి అందులో 3 ఎకరాల 71 సెంట్లను జిరాయితీగా మార్పు చేసి ఒక వ్యక్తి పేరున ఆన్‌లైన్‌ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయంటున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్దం. భూములకు సంబంధించి ఏ వ్యవహార ం చేయాలన్నా జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. ఆ తహసీల్దార్‌ తీసుకున్న నిర్ణయం జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి వెళ్ల లేదని విచారణలో తేలింది. అలాగేకొత్తవలసలో సర్వేనెంబరు 165-1లోని 19 ఎకరాల 22 సెంట్లలో సర్వేనెంబర్‌165-2, 165-3గా మార్పు చేసి 5 ఎకరాలకు సంబంధించి వేరే వ్యక్తి పేరున రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేసి ఆన్‌లైన్‌ చేశారనే ఆరోపణ రావడంతో దీనిపైనా ఉన్నతాధికారులు విచారించారు. చింతలపాలెం గ్రామ రెవెన్యూలోని తొమ్మిది సర్వేనెంబర్లలో ఉన్న భూములను 18 సర్వేనెంబర్లుగా మార్పు చేసి వేర్వేరు వ్యక్తులపేరున ఆన్‌లైన్‌ చేసినట్టు రుజువైందని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కొత్త సర్వేనెంబర్లను సృష్టించడం, నిబంధనల ప్రకారం మ్యూటేషన్‌ చేయకుండా ఇష్టానుసారంగా చేయడంతోనే ఆయనపై చర్యలు తీసుకున్నారని సమాచారం.

- ఒక కొత్తవలసలోనే కాకుండా జిల్లాలోని వివిధ మండలాల్లోనూ ఇలా జరుగుతున్నట్టు అధికారుల దృష్టికి రావడంతో మిగిలిన మండలాలపైనా రహస్యంగా విచారణ జరుగుతోందని తెలుస్తోంది. జిల్లాలో ఇష్టానుసారం వ్యవహరించే మరికొంతమందిపైనా వేటు పడే అవకాశం లేకపోలేదంటున్నారు. కొంతమంది తహసీల్దార్‌లు తాము పనిచేసిన సమయంలో అక్రమ వ్యవహారాలు నడిపి ప్రస్తుతం వేరే మండలాలకు బదిలీపై వెళ్లిపోయారు. వీరిపైనా విచరాణ సాగుతున్నట్టు తెలిసింది. కొత్తవలస తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన వ్యవహారాల్లో సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:41 PM