Share News

Industrialization? ఏదీ పారిశ్రామికీకరణ?

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:16 PM

What is Industrialization? పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాగా ఆవిర్భవించకముందు.. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. ఇక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ లేదు. వైసీపీ హయాంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడలేదు. దీంతో స్థానికంగా ఉపాధి దొరక్క ఈ ప్రాంతవాసులు పొట్ట చేతబట్టుకుని వలస బాట పడుతున్నారు. పనుల కోసం కుటుంబాలను వదిలి ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు పయనమవు తున్నారు. మహానగరాల్లో చాలీచాలని జీతాలతో బతకలేక.. తిరిగి స్వగ్రామాలకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  Industrialization?   ఏదీ పారిశ్రామికీకరణ?
సీతంపేట మండలం పనుకువలసలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు కేటాయించిన స్థలం ఇలా..

  • ప్రకటనలకే పరిమితమైన గత వైసీపీ సర్కారు

  • నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

  • జిల్లావాసుల్లో చిగురిస్తున్న ఆశలు

  • ఇప్పటికే పాలకొండలో స్థలం ఖరారు

  • మిగిలిన మూడుచోట్ల ఖరారు కాని పరిస్థితి

  • దీనిపై దృష్టి సారించాలని విన్నపం

పార్వతీపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాగా ఆవిర్భవించకముందు.. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. ఇక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ లేదు. వైసీపీ హయాంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడలేదు. దీంతో స్థానికంగా ఉపాధి దొరక్క ఈ ప్రాంతవాసులు పొట్ట చేతబట్టుకుని వలస బాట పడుతున్నారు. పనుల కోసం కుటుంబాలను వదిలి ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు పయనమవు తున్నారు. మహానగరాల్లో చాలీచాలని జీతాలతో బతకలేక.. తిరిగి స్వగ్రామాలకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్న నాటి వైసీపీ ప్రభుత్వ హామీ గాలిలో కలిసిపోయింది. పాచిపెంట మండలంలో ఇండస్ర్టీయల్‌ ఏరియా ఏర్పాటు చేస్తామన్న గత వైసీపీ పాలకులు ప్రకటనలకే పరిమితమయ్యారు. కనీసం స్థలాన్ని కూడా ఖరారు చేయలేకపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చేసి.. ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఇటీవల మరోసారి ప్రకటించడంతో జిల్లా నిరుద్యోగ యువత రాష్ట్ర సర్కారుపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పొరుగు రాష్ర్టాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదని జిల్లా యువత అభిప్రాయపడుతోంది. అయితే జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటివరకు పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో మాత్రమే ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 27 ఎకరాల్లో సుమారు రూ.7కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పార్వతీపురం, సాలూరు, కురుపాం, నియోజకవర్గాల్లో ఇంకా పార్క్‌లకు స్థలాలు ఖరారు కాలేదు. దీనిపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. మన్యాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి.. స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్వీట్‌షాప్‌లో పనిచేస్తున్నా..

నేను ఐటీఐ చదివాను. జిల్లాలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల స్వీట్‌ దుకాణంలో పనిచేస్తున్నా. గతంలో ఒకసారి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా విశాఖ వెళ్లాను. కానీ అక్కడ భోజనం, వసతి సక్రమంగా లేదు. జీతాలు కూడా వస్తాయో లేదోనన్న సందేహంతో నా స్నేహితుడితో కలిసి తిరిగి పార్వతీపురం వచ్చేశా.

- తేజ, పార్వతీపురం

===========================

స్థానికంగా ఉపాధి కల్పించాలి

ఇతర జిల్లాల్లో కంటే స్థానికంగా మాకు ఉపాధి కల్పించాలి. దీనివల్ల తల్లిదండ్రులను చూసుకునే వీలు కలుగుతుంది. ప్రైవేట్‌ ఉద్యోగాల్లో వచ్చే జీతాలతో ఇతర ప్రాంతాల్లో బతకడం కష్టం.

- రామారావు, పార్వతీపురం

===========================

స్థలాలు ఖరారు కాలేదు

పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటుకు స్థలం ఖరారైంది. ఆ ప్రాంతంలో రోడ్లు, కాలువలు నిర్మాణాలు జరుగుతున్నాయి. సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుకు స్థలాలు ఖరారు కాలేదు.

- కరుణాకర్‌రావు, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి మేనేజర్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 30 , 2025 | 11:16 PM