Share News

చెత్తశుద్ధి ఏదీ?

ABN , Publish Date - May 08 , 2025 | 11:44 PM

పార్వతీపురం మున్సిపాల్టీలో చెత్త సంపద కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  చెత్తశుద్ధి ఏదీ?
డంపింగ్‌ యార్డులో పెరిగిపోతున్న చెత్త నిల్వలు

- పార్వతీపురంలో చెత్త సంపద కేంద్రం ఏర్పాటెప్పుడో..

- ప్రచారం వరకే తడి, పొడి చెత్తల సేకరణ

- ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా పడని అడుగులు

- ఎనర్జీ తయారీకి మున్సిపాల్టీలో వ్యర్థాలను కోరిన జిందాల్‌

- అయినా చొరవ చూపని అధికారులు, ప్రజాప్రతినిధులు

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కదలికలు

- ఆ తర్వాత అటకెక్కిన వైనం

పార్వతీపురం టౌన్‌, మే8(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపాల్టీలో చెత్త సంపద కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా 2002లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం శివారున ఉన్న డంపింగ్‌ యార్డులోనే చెత్త సంపద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రూ.20 లక్షలతో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా.. అప్పటి పాలకవర్గం కూడా ఆమోదం తెలిపింది. స్థల పరిశీలన కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటు అటకెక్కిందనే చెప్పాలి.

ప్రచారానికే పరిమితం..

- స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా 2014 నుంచి మున్సిపాల్టీలోని 30 వార్డుల్లో పొడి, చెత్తలను సేకరించడం ప్రారంభించారు. పర్యావరణానికి హాని కలిగించే వాటిని ధ్వంసం చేయడంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీకి ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ప్రజలు ఇవ్వాలని ప్రచారం నిర్వహించారు. ప్రచారం అయితే విజయవంతమైంది కానీ చెత్త సంపద కేంద్రం ఏర్పాటు మాత్రం కలగానే మిగిలిపోయింది వ్యర్థాల నుంచి ఆర్థికాభివృద్ధి సాధించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రసంగాలు ఇస్తున్నారే తప్ప ఆచరణ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.


- మున్సిపాల్టీలో 70 వేలకు పైబడి జనాభా ఉంటారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పార్వతీపురం చుట్టూ పుట్టగొడుగుల్లా కాలనీలు వెలుస్తున్నాయి. రోజురోజుకూ పట్టణ జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో 30 వార్డుల నుంచి రోజూ పారిశుధ్య కార్మికులు 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. భవిష్యత్‌లో 20 నుంచి 30 టన్నుల వరకు చెత్తలు, వ్యర్థాలు పెరిగే అవకాశం ఉందని ప్రజారోగ్యశాఖాధికారులే చెబుతున్నారు.

-ఎనర్జీని సృష్టించేందుకు మున్సిపాల్టీలోని 30 వార్డుల నుంచి సేకరిస్తున్న వ్యర్థాలను తమకు సరఫరా చేయాలని గతంలో జిందాల్‌ ఫ్యాక్టరీ ప్రతినిధులు కోరారు. దీనివల్ల మున్సిపాల్టీకి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.

- గత ఏడాది కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రలు స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రజారోగ్యశాఖాధికారులు తడి, పొడి చెత్తల సేకరణకే పరిమితమవుతున్నారు. ఇప్పటికైనా చెత్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛ పార్వతీపురమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ప్రణాళికలు సిద్ధం చేస్తాం..

చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటుకు గతంలో ఉన్నతాధికారులు ప్రతిపాదనలు చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తాం. స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమానికి మా వంతుగా కృషి చేస్తున్నాం.

- కె. పకీరురాజు, ప్రజారోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్‌, పార్వతీపురం మున్సిపాల్టీ

Updated Date - May 08 , 2025 | 11:44 PM