What happened to those chickens? ఆ కోళ్లకు ఏమైంది?
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:54 PM
What happened to those chickens?
ఆ కోళ్లకు ఏమైంది?
ఒక్క ఫారంలో.. రెండు రోజుల్లో 38 వేల నాటుకోళ్లు మృతి
ఇప్పటికే లక్షల సంఖ్యలో బ్రాయిలర్ కోళ్ల మృత్యువాత
నివేదిక వచ్చే వరకు పెంచొద్దన్న పశుసంవర్ధకశాఖ ఏడీ
కొత్తవలస, సెప్టెంబర్ 2(ఆంధ్రజ్యోతి): కొత్తవలస ప్రాంతంలో కోళ్ల మృత్యువాత ఆగడం లేదు. ఇప్పటికే లక్షల సంఖ్యలో బ్రాయిలర్ కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. రెండు రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఫారంలోనే 38 వేల నాటుకోళ్లు మృతి చెందడంతో పెంపకందారు ఆందోళన చెందుతున్నాడు. కోళ్లకు సోకిన ఆ వ్యాధి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడి ఫారాలకు ఫారాలే ఖాళీ అయిపోయాయి. బ్రాయిలర్ కోళ్లకు భిన్నంగా మండలంలోని రామలింగపురం గ్రామానికి చెందిన వి.రాంబాబు ప్రియాంక ఆగ్రో ఫారమ్స్ పేరుతో 13 రేకుల షెడ్లలో సుమారు 40 వేల వరకు నాటు కోళ్లను పెంచుతున్నాడు. అంతు చిక్కనివ్యాధితో సోమ, మంగళవారాల్లో 38 వేల వరకు మృత్యువాత పడ్డాయి. మిగిలిన కోళ్లు కూడా బుధవారం నాటికి చనిపోయేలా కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. నాటు కోళ్లకు చిన్న చిన్న అంటువ్యాధులు వచ్చినా తట్టుకుంటాయని, ఆ కారణంగానే హేచరీస్‌తో ఒప్పందం చేసుకోకుండా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా వరకు మార్కెటింగ్ చేసుకుంటున్నానన్నాడు. సుమారు 180 రోజుల పాటు నాటు కోళ్లను పెంచి మార్కెట్ చేస్తుంటానని, మార్కెట్‌కు తరలించే సమయానికి ఈ వ్యాధి రావడంతో రెండు రోజుల్లో 38 వేల కోళ్లు చనిపోయాయన్నారు. ఎలా బయటపడాలో అర్థం కావడంలేదని వాపోయాడు.
వ్యర్థాలను తొలగించి నిప్పు పెట్టండి
కన్నంనాయుడు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, కొత్తవలస
కోళ్ల మృతిపై విజయవాడ ల్యాబ్‌కు నమూనాలు పంపించినప్పటికీ నివేదిక వచ్చినా మరణాలను ఇప్పట్లో ఆపడం సాధ్యం కాదు. నిపుణులు కూడా చేతులెత్తేసారు. ఇప్పట్లో కోళ్ల ఫారాల్లో కొత్తగా కోళ్లను తెచ్చి పెంచకపోవడమే మంచిది. ముందు కోళ్ల ఫారాలలోని వ్యర్థాలను పూర్తిగా తొలగించి వాటికి నిప్పు పెట్టాలి. ఖాళీ చేసిన ఫారాల్లో షెడ్‌లను శుభ్రం చేయాలి. చనిపోయిన కోళ్లను పూడ్చి పెట్టాలి. వ్యాధి సోకిన కోళ్ల వ్యర్థాలను పొలాల్లో ఎరువు కింద కూడా వాడొద్దు. నివేదిక వచ్చాక ఏం చేయాలనే విషయాన్ని వివరిస్తాం.