ఆ ప్రతిపాదన ఏమైందో?
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:14 AM
బాడంగి మండల కేంద్రంలో ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి విమానాశ్రయాన్ని విస్తరించి నేవీ ఆయుఽధాగారంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
- బాడంగి విమానాశ్రయాన్ని విస్తరిస్తామన్న ప్రభుత్వం
- నేవీ ఆయుఽధాగారంగా మారుస్తామని ప్రకటన
- భూసేకరణకు రూ.500 కోట్లు అవసరమని అంచనా
- ఎనిమిది నెలలవుతున్నా ముందుకు పడని అడుగులు
బొబ్బిలి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): బాడంగి మండల కేంద్రంలో ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి విమానాశ్రయాన్ని విస్తరించి నేవీ ఆయుఽధాగారంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఎనిమిది నెలలవుతున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. భూసేకరణ ప్రక్రియతో పాటు ఇతరత్రా పనుల్లో కదలిక మందకొడిగా ఉంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం 183 ఎకరాల్లో ఉంది. దీనికి అదనంగా 1,585 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.500 కోట్లు నిధుల అవసరం ఉంటుందని అంచనావేస్తూ అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చి అంచనా వ్యయం ఇంకా పెరిగిపోతుంది.
సేకరించాల్సిన భూమి..
పాల్తేరులో 782 ఎకరాలు, ముగడలో 602, రామచంద్రపురంలో 5, పూడివలసలో 72, మల్లమ్మపేటలో 60, కోడూరులో 90 ఎకరాల చొప్పున రైతుల నుంచి సేకరించాలని రెవిన్యూ యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. నేవీ ఆధీనంలో 183 ఎకరాలు, డి.పట్టా భూములు 50 ఎకరాలు, నీటివనరులు ఇతరత్రా 112 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములకు భూసేకరణ చట్టం ప్రకారం రైతులతో సంప్రదింపులు జరిపి ధరను నిర్ణయించాల్సి ఉంది. ఇదే సమయంలో కొత్తరకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూములన్నీ పోయిన తరువాత తామెలా జీవించాలంటూ పాల్తేరు గ్రామస్థులు ఇటీవల ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దీనిపై సామాజిక ప్రభావిత సర్వే (సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) విధానంలో గ్రామాలను ఖాళీ చేయించే అంశంపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. చట్టం నిర్దేశించిన ప్రకారం అధికారులు అడుగులు వేయాలి.
కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి..
భూసేకరణ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 1,585 ఎకరాలను సేకరించేందుకు రూ. 500 కోట్లు నిధులు అవసరమని అంచనావేశాం. ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. భూసేకరణకు నిధులు విడుదలైతే అందుకు తగ్గ అడుగులు ముందుకు పడతాయి.
-జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, ఆర్డీవో, బొబ్బిలి