ఆ డబ్బు ఏమైంది?
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:53 PM
మండలంలోని చోడమ్మఅగ్రహారం వద్ద ఈ నెల 11వ తేదీ రాత్రి ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.60లక్షలు మాయంకావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- అసలు బస్సులో తెచ్చారా? లేదా?
- రూ.60లక్షలు మాయంపై అనుమానాలు
- పోలీసుల ముమ్మర దర్యాప్తు
పూసపాటిరేగ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని చోడమ్మఅగ్రహారం వద్ద ఈ నెల 11వ తేదీ రాత్రి ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.60లక్షలు మాయంకావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డబ్బును బస్సులో తెచ్చారా?లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. శ్రీకాకుళం నుంచి గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ ప్రైవేట్ బస్సులో రెండు బస్తాలతో రూ.1.30కోట్లను తీసుకొని వెళ్తుండగా చోడమ్మఅగ్రహారం వద్ద ఒక బస్తాలో ఉన్న రూ.60లక్షలు పోయాయని భోగాపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు ప్రయాణికులను విచారించగా ఆ బస్తాను తాము చూడలేదని వారు చెప్పారు. చోరీకి గురైన డబ్బు బస్తాలో ఆపిల్ కంపెనీకి చెందిన ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు వాటి లొకేషన్‌ను తెలుసుకొనే పనిలో పడ్డారు. సాధారణంగా ఆపిల్ గాడ్జెట్స్ చోరీకి గురైతే ట్రేసింగ్ ద్వారా వాటిని కనిపెట్టవచ్చు. కానీ, ఈ బస్తాలో ఉన్న ఆపిల్ ఇయర్‌బడ్స్ ట్రేసింగ్‌కు చిక్కకపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే డబ్బు పోయిందా? లేక పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటూ సందేహాలు కలుగుతున్నాయి. అసలు ఇంతపెద్ద మొత్తాన్ని ప్రైవేట్ బస్సులో తీసుకెళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితులు మాత్రం భూమి కొనుగోలుకు తీసుకొని వెళ్తున్నట్లు తెలుపుతున్నారు. దీనిపై ఎస్‌ఐ దుర్గాప్రసాద్ మాటాడుతూ.. ‘డబ్బు మాయంకావడంపై పలు అనుమానాలు ఉన్నాయి. కేసు దర్యాప్తును ముమ్మరం చేశాం. అసలు నిజంగానే డబ్బు దొంగలించబడిందా? లేదా అన్నది తేలుస్తాం.’ అని తెలిపారు.