Share News

ఆ బంగారం ఏమైందో?

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:11 AM

మండలంలోని మంగళపాలెం గ్రామానికి చెందిన గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో భారీ చోరీ జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు.

 ఆ బంగారం ఏమైందో?
మంగళపాలెంలో విచారణ చేపడుతున్న పోలీసులు (ఫైల్‌)

- ఐదు నెలలు గడుస్తున్నా పురోగతి లేని మంగళపాలెం చోరీ కేసు

- మిగతా కేసులదీ ఇదే పరిస్థితి

కొత్తవలస, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని మంగళపాలెం గ్రామానికి చెందిన గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో భారీ చోరీ జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఈ ఏడాది మే 25న రాత్రి జగదీష్‌బాబు ఇంట్లో సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈచోరీ రాష్ట్రంలోనే సంచలనమైంది. జగదీష్‌బాబుకు జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉండడమే దీనికి కారణం. ఈ కేసుపై అప్పటి ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో పాటు కిందిస్థాయి పోలీసు అధికారులు నెల రోజులపాటు ముమ్మరంగా దర్యాపు చేశారు. చోరీకి పాల్పండింది మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్‌గా గుర్తించామని చెప్పి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, వీరి నుంచి కనీసం ఒక్క తులం బంగారం కూడా రికవరీ చేయలేకపోయారు. పట్టుబడిన వ్యక్తులు తాము మిగిలిన నిందితులతో కూలికి వచ్చామని, తమకు రూ.30 వేల చొప్పున ఇచ్చారని, అసలు దొంగలు ఉన్నారంటూ మరో ముగ్గురి పేర్లను పోలీసులకు చెప్పారు. వారి కోసం గాలించిన పోలీసులకు నిరాశే మిగిలింది. ఇంతవరకు వారిని పట్టుకోలేకపోయారు. దీంతో ఈ కేసు నీరు గారిపోయినట్టేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చోరీ గురించి ఎప్పుడైనా విలేఖరులు పోలీసులను అడిగితే కొంత సమాచారం ఉంది.. మరికొంత సమాచారం వస్తే ఛేదిస్తామని చెప్పుకువస్తున్నారు. ఈ విషయమై బాధితుడు రాపర్తి జగధీష్‌బాబును అడిగితే తన లాంటి వారికే ఇలా జరిగితే సామాన్య వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ని ట్టూరుస్తున్నారు. ఈ చోరీ జరిగిన కొద్ది రోజులకే కొత్తవలస విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో నివాసం ఉంటున్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి ఇంటిలో దొంగతనం జరిగింది. ఐదు తులాల బంగారంతో పాటు వెండి, డబ్బులు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో కూడా నిందితులను పట్టు కోవడం గాని, చోరీ సొత్తు రికవరీ చేయడం గాని ఇంతవరకు జరగలేదు. ఆ తరువాత దేశపాత్రునిపాలెం సమీపంలో నివాసం ఉంటున్న శారడా కర్మాగారంలో పని చేస్తున్న ఓ వ్యక్తి ఇంటిలో దొంగతనం జరిగింది. ఈ కేసులోనూ ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఈ కేసులను ఎప్పుడు ఛేదిస్తారు? బాధితులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Oct 25 , 2025 | 12:11 AM