మెంటాడను ఏం చేస్తారో?
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:21 AM
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో రెండుసార్లు సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
- రెండు జిల్లాల్లో కొనసాగుతున్న మండలం
- కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
- ఒకే నియోజకవర్గం.. ఒకే రెవెన్యూ డివిజన్ చేయాలని నిర్ణయం
- పార్వతీపురం డివిజన్‌లోకి మెంటాడ వచ్చే అవకాశం?
పార్వతీపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో రెండుసార్లు సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, చేర్పులు, మార్పులకు సంబంధించి ప్రతిపాదనలను ఇచ్చింది కేబినెట్ సబ్ కమిటీ. అయితే, రెవెన్యూ డివిజన్ల మార్పు మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది. ఒకే నియోజకవర్గంలోని మండలాలు ఒకే రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే విషయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం జిల్లాలోని మెంటాడ మండలం విషయంలో మార్పు జరిగే అవకాశం ఉంది.
జిల్లా పరిస్థితి..
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 15 మండలాలు ఉన్నాయి. పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం మండలాలు, కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి మండలాలు, సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట, సాలూరు, మక్కువ, మెంటాడ మండలాలు పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాలు ఉన్నాయి. ఇందులో సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం విజయనగరం జిల్లా బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో, కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. మిగిలిన మండలాలు పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు మెంటాడ మండలాన్ని తొలుత పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో చేర్చారు. అయితే, అప్పట్లో వైసీపీ నాయకుల ఒత్తిడితో ఆ మండలాన్ని విజయనగరం జిల్లాలో విలీనం చేశారు.
ఏం చేస్తారో?
ప్రస్తుతం మెంటాడ మండలం బొబ్బిలి డివిజన్‌లో ఉంది. గతంలో పార్వతీపురం డివిజన్‌లో ఈ మండలం ఉండేది. జిల్లాల పునర్విభజన సమయంలో వైసీపీ నాయకుల ఒత్తిడితో ఈ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచడంతో పాటు బొబ్బిలి డివిజన్‌కు మార్చారు. వాస్తవంగా చెప్పాలంటే బొబ్బిలికి, పార్వతీపురానికి దూరం అంతంత మాత్రమే. నియోజకవర్గ కేంద్రం సాలూరు కావడంతో మెంటాడ మండలాన్ని పార్వతీపురం డివిజన్‌లోనే పద్ధతి ప్రకారం ఉంచాలి. కానీ, ఆ విధంగా కాకుండా వైసీపీ తన రాజకీయ స్వార్థం కోసం మెంటాడ మండలానికి సంబంధించి నియోజకవర్గం ఒక జిల్లాలో, రెవెన్యూ డివిజన్ మరొక జిల్లాలో ఉండే విధంగా జిల్లాల పునర్విభజన సమయంలో వ్యవహరించారు. దీంతో ఈ మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవడానికి అటు జిల్లా కేంద్రం విజయనగరానికి లేదా డివిజన్ కేంద్రం బొబ్బిలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకే నియోజకవర్గం, ఒకే రెవెన్యూ డివిజన్ అని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలోకి విలీనం అవుతుందనే ప్రచారం ఉంది. అలాగే కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కొమరాడ, గరుగుబిల్లి మండలాలు పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.