Share News

మా సంగతేంటి?

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:02 AM

మండల పరిధిలో జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ అల్యూమినియం పరిశ్రమ (జేఎస్‌డబ్ల్యూ) స్థాపన కోసం ఐదు గ్రామాల్లోని రైతుల నుంచి 2008లో అప్పటి ప్రభుత్వం 1166.43 ఎకరాలను సేకరించింది.

    మా సంగతేంటి?
, ఎమ్మెల్సీ రఘురాజును నిలదీస్తున్న జిందాల్‌ నిర్వాసితులు(ఫైల్‌)

- మీరు చెబితేనే ‘జిందాల్‌’కు భూములిచ్చాం

- పదిహేడేళ్లు గడుస్తున్నా పరిశ్రమను పెట్టలేదు

-ఇప్పుడు నెలకొల్పే ఎంఎస్‌ఎంఈ పార్కులో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి

- చర్చలు జరపకుంటే ఉద్యమిస్తాం

- ఎమ్మెల్సీ రఘురాజు వెంటపడుతున్న నిర్వాసిత రైతులు

  • మీరు ఇమ్మంటేనే 17 ఏళ్ల కిందట జిందాల్‌ పరిశ్రమకు భూములిచ్చాం. మీతోపాటు అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఒప్పించారు. పరిశ్రమ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయని చెప్పారు. భూములు తీసుకున్న సమయంలో నాలుగేళ్లలోనే పరిశ్రమను నిర్మిస్తామని యాజమాన్యం చెప్పింది. కానీ, ఇంతవరకు పునాదిరాయి వేయలేదు. ఇప్పుడు ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు పెడతామని చెబుతున్నారు. వీటిని జిందాల్‌ యాజమాన్యం నిర్మిస్తుందా? మరేవరికైనా భూములను ధారాదత్తం చేస్తుందా?. మా ఉద్యోగాల బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు?. భూసేకరణ సమయంలో అనేక హామీలు ఇచ్చారు. వీటికి సమాధానమెవరు చెబుతారు?. ఈ సందేహాలన్నింటినీ తీర్చేందుకు నిర్వాసిత రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరాం. ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మాతో చర్చలు జరపకుంటే ఉద్యమించక తప్పదు.

    -ఇటీవల ఎస్‌.కోట మండలం బొడ్డవరలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును నిలదీసిన జిందాల్‌ భూనిర్వాసితులు


శృంగవరపుకోట, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ అల్యూమినియం పరిశ్రమ (జేఎస్‌డబ్ల్యూ) స్థాపన కోసం ఐదు గ్రామాల్లోని రైతుల నుంచి 2008లో అప్పటి ప్రభుత్వం 1166.43 ఎకరాలను సేకరించింది. అయితే, ఇంతవరకు ఈ భూముల్లో ఎటువంటి పరిశ్రమను నిర్మించలేదు. కనీసం పునాది రాయి కూడా పడలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ (మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు రెండేళ్ల కిందట ప్రకటించింది. మొత్తం రూ.3,970 కోట్లుతో పది ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పింది తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 45వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికింది. భూముల వివరాలతో పాటు నష్టపరిహారం తదితర వివరాలను ఇండస్ట్రీయల్‌, కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అందించారు. అయితే, అప్పట్లో ఇవన్నీ ప్రతిపాదన దశలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈశాఖకు జిల్లా పరిధిలోని గజపతినగరం నియోజకవర్గ శాసన సభ్యుడు కొండపల్లి శ్రీనివాస్‌ మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నెల్లిమర్ల, బలిఘట్టం, కొట్టక్కి, కొండకిండం గ్రామాల్లోని 217.58 ఎకరాల్లో రూ.789 కోట్లుతో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల ద్వారా 1,631 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విధంగా శృంగవరపుకోట మండల పరిధిలో జిందాల్‌ పరిశ్రమకు సేకరించిన భూముల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జిందాల్‌ యజమాని సజ్జల్‌ జిందాల్‌ చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. ఈనెల 21న విశాఖపట్టణంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దీనికి ఒక రోజు ముందు, లేదంటే మరో రోజున శంకుస్థాపనకు ముహూర్తం పెడతారని భోగట్టా.


నిర్వాసితుల్లో ఆందోళన

జిందాల్‌ కోసం సేకరించిన భూముల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో నిర్వాసితుల్లో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిశ్రమల్లో తమకు, తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారో లేదోనని కలవరపడుతున్నారు. దీంతో పాటు భూ సేకరణ సమయంలో ఇచ్చిన హమీల కోసం పట్టుపడుతున్నారు. పరిశ్రమను స్థాపించకపోయిన కొంత మందికి కనీస వేతనం కింద నెలకు రూ.10,900 అందిస్తున్నారు. అయితే, 58 ఏళ్ల వరకే వేతనం అందిస్తుండడంపై నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు 62 ఏళ్ల వరకు వేతనం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే, పరిశ్రమల్లో తమ పిల్లలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో పాటు భూములు తీసుకున్న సమయంలో జిందాల్‌ యాజమాన్యం ఉచిత షేర్‌లు ఇస్తామని చెప్పింది. అప్పట్లో భూములకు అందించిన నష్టపరిహారానికి సమానంగా షేర్‌లు కోనసాగిస్తామని చెప్పింది. ఈ విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. అప్పట్లో ఎకరాకు రూ.2,00,500 నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు అవే భూములు ఎకరా రూ.కోట్లలో పలుకుతుంది. షేర్లు కూడా అదే రీతిన పెంచాలని నిర్వాసితులు కోరుతున్నారు. దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అప్పట్లో రైతులను ఒప్పించిన రఘురాజు

జిందాల్‌ పరిశ్రమ కోసం చీడిపాలెం గ్రామానికి చెందిన 71 మంది రైతుల నుంచి 178.24 ఎకరాలు, చినఖండేపల్లికి చెందిన 32మంది రైతుల నుంచి 142.69 ఎకరాలు, కిల్తంపాలెంనకు చెందిన 90 మంది రైతుల నుంచి 399.37, మూలబొడ్డవరకు చెందిన 189 మంది రైతుల నుంచి 422.56 ఎకరాలు, ముషిడిపల్లిలో 23.57 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 1166.43 ఎకరాలు (ఇందులో 180.73 ఎకరాలు ప్రైవేటు భూమి) సేకరించారు. భూములు ఇచ్చిన వారిలో అత్యధిక శాతం మంది గిరిజన రైతులే ఉన్నారు. ఈ భూములను 2008లో అప్పటి ప్రభుత్వం జిందాల్‌ యాజమాన్యానికి రిజిస్ట్రేషన్‌ చేసింది. ఈ గ్రామాలన్నీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు అనుకాలం కావడంతో అప్పట్లో పరిశ్రమకు భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించారు. కానీ, జిందాల్‌ యాజమాన్యం ఇప్పుడు రైతులను పట్టించుకోకపోవడంతో వారంతా రఘురాజు వెంటపడుతున్నారు. ‘మీరు చెబితేనే భూములు ఇచ్చాం. కనుక మీరే సమస్యను పరిష్కరించాలంటూ’ ఆయన్ను డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అటు జిందాల్‌ యాజమాన్యం నుంచి స్పందన లేక, ఇటు నిర్వాసిత రైతులకు సమాధానం చెప్పలేక రఘురాజు సతమతమవుతున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:02 AM