What about running veterinary hospitals? పశుసంచార వైద్యశాలల జాడేది?
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:56 PM
What about running veterinary hospitals? జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. సీజన్ మారుతోంది. ముఖ్యంగా పశువుల్లో గాలికుంటు, ఇతర రుగ్మతలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వాటికి వైద్యం అందివ్వాల్సిన పశుసంచార వైద్యశాలల జాడ మాత్రం కానరావడం లేదు. ఆ వాహనాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి.
పశుసంచార వైద్యశాలల
జాడేది?
ఆ వాహనాల్లో మందుల కొరత
మారుమూల ప్రాంతాలకు వెళ్లడం లేదన్న విమర్శ
నిరాశలో పశువుల పెంపకందారులు
రాజాం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. సీజన్ మారుతోంది. ముఖ్యంగా పశువుల్లో గాలికుంటు, ఇతర రుగ్మతలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వాటికి వైద్యం అందివ్వాల్సిన పశుసంచార వైద్యశాలల జాడ మాత్రం కానరావడం లేదు. ఆ వాహనాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. మారుమూల గ్రామాల వైపు చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వెళ్లినా పశు వైద్యానికి తగ్గట్టు మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు షాపుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. ఇది రైతులకు అదనపు భారంగా మారుతోంది.
గత ప్రభుత్వం పశువైద్యం విషయంలో చాలా నిర్లక్ష్యం చేసింది. పశుసంవర్థక శాఖలో పనిచేసే పశు వైద్యశాలలను సరిగ్గా నిర్వహించలేదు. భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకోలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పశు ఆరోగ్య సంచార వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతగా జిల్లాకు ఏడు వాహనాలు అందించింది. మలి విడతగా మరో 6 వాహనాలు అందించింది. దాదాపు అన్ని నియోజకవర్గాలకు రెండు చొప్పున వాహనాలు సమకూరాయి. ఒక్కో వాహనంలో పశు వైద్యాధికారి, వైద్య సహాయకుడు, డ్రైవర్ ఉంటారు. ప్రయోగశాలతో పాటు మందులు అందుబాటులో ఉంచాలి. పశువులు ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వాటికి ప్రాథమిక వైద్యం అందించాలి. సమీప పశువైద్యశాలకు తెచ్చి చికిత్స అందించాలి. కానీ మందుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వాహనాలు సరిగా సేవలందించడం లేదన్న విమర్శలున్నాయి.
జిల్లాలో అంచనాగా 4,75,805 పశువులు ఉన్నాయి. అందులో 3,77,960 ఆవులు, 97,845 గేదెలు ఉన్నాయి. అదే విధంగా గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. పందులు 2,585, కోళ్లు 51,26,764 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క విజయనగరం నియోజకవర్గంలో ఒకటి.. మిగతా నియోజకవర్గాల్లో 2 చొప్పున పశు ఆరోగ్య సంచార వాహనాలున్నాయి. గతంలో వేల కిలోమీటర్లు తిరిగే ఈ వాహనాలు ప్రస్తుతం వందల కిలోమీటర్లకే పరిమితం అవుతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ వాహన సేవలను సక్రమంగా అందిస్తే జిల్లాలో పశువుల వ్యాధులు అనేవి ఉండవు. ఈ వాహనంలో 15 రకాల రక్త పరీక్షలు చేసే ప్రయోగశాల ఉంటుంది. పశువులను వాహనంలోకి ఎక్కించి వైద్యం అందించే హైడ్రాలిక్ వ్యవస్థ ఉంటుంది. టోల్‌ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ చేసిన వెంటనే ఆపదలో ఉన్న పశువు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే నిపుణులను సైతం తెచ్చి వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలి. అటువంటి కీలకమైన సంచార ఆరోగ్య వాహనాలు సరైన గాడి తప్పాయి. నిర్వహణ సరిగా లేదు. ముఖ్యంగా మందులు ఉండడం లేదు.
మెరుగ్గా సేవలు
జిల్లాలో సంచార పశు ఆరోగ్య వాహనాలు మెరుగైన సేవలందిస్తున్నాయి. మందుల కొరత అన్నదే రానివ్వకుండా చేస్తాం. ఫోన్ చేసిన వెంటనే వెళ్లి వైద్యసేవలందించేలా ఆదేశాలిచ్చాం. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
- దామోదరరావు, ఇన్‌చార్జి, పశుసంవర్థక శాఖ జేడీ, విజయనగరం
------------