Share News

What About Our Situation? మా పరిస్థితేంటి?

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:17 AM

What About Our Situation? జిల్లాలో గిరిజన గర్భిణుల వసతి గృహాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో ఏరియా ఆసుపత్రి సిబ్బందిని నియమించాలని సూచించారు.

What About Our Situation? మా పరిస్థితేంటి?
గర్భిణులకు సేవలందిస్తున్న వైటీసీ సిబ్బంది

  • వారిని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని మౌఖిక ఆదేశాలు

  • ఆ స్థానంలో ఆసుపత్రి సిబ్బంది నియామకం

  • కొన్నేళ్లుగా సేవలందిస్తున్న వారిని ఆదుకోవాలని విన్నపం

సాలూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన గర్భిణుల వసతి గృహాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో ఏరియా ఆసుపత్రి సిబ్బందిని నియమించాలని సూచించారు. దీంతో కొన్నాళ్లుగా పనిచేస్తున్న వసతిగృహ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- గిరిశిఖర గ్రామాలకు చెందిన గర్భిణులను మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గతంలో సాలూరు, భద్రగిరి, సీతంపేటలో వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో స్టాఫ్‌ నర్సు, ఏఎన్‌ఎంలు, డ్రైవర్‌ను 2019లో నియమించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారి పరిస్థితి మారింది. 2021 వరకు ఆరు నెలలకొకసారి జీతాలు చెల్లించేవారు. బడ్జెట్‌ రాలేదని ఆ తర్వాత 21 నెలల పాటు సగం జీతమే చెల్లించారు. 2023లో ఏడాది పాటు ఎలాంటి జీతాలు చెల్లించలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైద్య సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వరకు వారు విధులు నిర్వహించగా.. రెండు నెలల వేతనాలు మాత్రమే చెల్లించారు. ఇంకా ఏడు నెలల జీతం బకాయి ఉందని సాలూరు సిబ్బంది త్రివేణి, రాములమ్మ, మంగమ్మ, దేవి, నాగమణి, స్వప్న, బంగారు లక్ష్మి, నందిని తెలిపారు. కాగా మంగళవారం వారు విధుల్లోకి వెళ్లగా.. ఏరియా ఆసుపత్రి నుంచి నలుగురు సిబ్బంది (గౌరీశ్వరి, శ్వేత, నీలావతి, లక్ష్మి)లు ఇక్కడ ఉండడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇక్కడకు వచ్చామని వారు చెప్పారు. ‘మీరు ఇక్కడకు వచ్చి మా పొట్టలు కొట్టొద్దు..’ అని సాలూరు వైటీసీ సిబ్బంది వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు.

- సాలూరు పట్టణంలోని గుమడాంకు వెళ్లే దారిలో ఉన్న వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)లో నిర్వహిస్తున్న గిరిజన గర్భిణుల వసతి గృహంలో ఒక స్టాఫ్‌ నర్సు, ఎనిమిది మంది ఏఎన్‌ఎంలను అప్పట్లో నియమించారు. మొదటిలో రూ.18వేల జీతమని చెప్పారు. ఐఆర్‌పీడబ్ల్యూ స్వచ్ఛంద సేవా సంస్థలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిగా చూపుతూ.. నెలకు రూ.15వేలే చెల్లించేవారని వైటీసీ సిబ్బంది తెలిపారు. కాగా భద్రగిరి వసతి గృహంలో స్టాఫ్‌ నర్సు, ఏఎన్‌ఎంలు, డ్రైవర్‌, సెక్యూరిటీ సిబ్బందితో కలిపి మొత్తంగా 11 మంది పనిచేస్తున్నారు. ఇక సీతంపేట ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, అంబులెన్స్‌ డ్రైవర్‌, స్వీపర్‌ ఉన్నారు. వారంతా కొన్నాళ్లుగా గిరిజన గర్భిణులకు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిలుపుదల చేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతిని వివరణ కోరగా.. ‘ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైటీసీ సిబ్బందిని తాత్కాలికంగా నిలుపుదల చేశాం. వారి స్థానంలో ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వారిని నియమిస్తాం.’ అని తెలిపారు.

తొలగింపు ఆలోచన మానుకోవాలి

గుమ్మలక్ష్మీపురం: ‘ గిరిజన గర్భిణుల వసతిగృహాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిని తొలగించాలనే ఆలోచనను జిల్లా అధికారులు మానుకోవాలి. గత ఆరేళ్లుగా చాలీచాలని జీతంలో వారు పనిచేస్తూ.. వైద్య సేవలు అందిస్తున్నారు. సాలూరు, గుమ్మలక్ష్మీపురం వైటీసీల్లో నిర్వహిస్తున్న గిరిజన గర్భిణుల వసతిగృహాలను నీతిఅయోగ్‌ కూడా గుర్తించి ప్రశంసించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైటీసీ సిబ్బందిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. గత ఏడు నెలలుగా వారికి బకాయిపడిన జీతాలు తక్షణమే చెల్లించాలి. ’ అని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర కమిటీ అధ్యక్షుడు తాడంగి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 24 , 2025 | 12:17 AM