What about not arriving on time? సమయానికి రాకపోవడమేంటి?
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:46 PM
What about not arriving on time? సచివాలయ ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడంతో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
సమయానికి రాకపోవడమేంటి?
ఆ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు ఇవ్వండి
ఎంపీడీవోను ఆదేశించిన కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
రామభద్రపురం సచివాలయం ఆకస్మిక తనిఖీ
రామభద్రపురం/ బొబ్బిలి/ రూరల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడంతో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రామభద్రపురం సచివాలయం-3ని మంగళవారం ఆయన సందర్శించారు. మూమెంట్ రిజిస్టర్‌ను పరిశీలించాక హార్టీకల్చర్ అసిస్టెంట్ జి.వరలక్ష్మి, సర్వేయర్ వరప్రసాద్, వెల్ఫేర్ అసిస్టెంట్ అరుణ్‌చంద్రకుమారి విధులకు రాకపోవడాన్ని గమనించారు. ఆ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవో రత్నంను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రతీరోజూ 10కంటే ఎక్కువ సర్వీసులు అందించాలన్నారు. తొలుత సచివాలయం పరిధిలో ఎన్ని రేషన్‌కార్డులు ఉన్నాయి, రేషన్ షాపులు ఎన్ని ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. సచివాలయం పరిధిలో ఎంత రెవెన్యూ వస్తోంది అని సిబ్బందిని అడిగారు. ఆయన వెంట బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు ఉన్నారు.
అంగన్వాడీ వర్కర్‌ను సస్పెండ్ చేయండి: కలెక్టర్
అంగన్‌వాడీ కేంద్రంలో మెనూ పాటించకపోవడంపై కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బొబ్బిలి మండలం పారాది అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, సౌకర్యాలు, రికార్డు నిర్వహణపై ఆరా తీశారు. మంగళవారం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో టమాటపప్పు వండాలి. తయారు చేయకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యానికి బాధ్యురాలైన అంగన్వాడీ వర్కర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మూడు రోజులుగా అంగన్వాడీ కేంద్రంలో హాజరు నమోదు చేయకపోయినా గుర్తించనందుకు సీడీపీవోకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో కాసేపు సరదాగా గడిపి పిల్లలతో ముచ్చటించారు.
సేవాధృక్పథంతో పనిచేయండి
సచివాలయ సిబ్బంది ప్రజల పట్ల మర్యాద, సేవాదృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ రామసుందర రెడ్డి సూచించారు. బొబ్బిలిలోని సాయినగర్ సచివాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నదీ లేనిదీ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. అందరూ సమయపాలన పాటించాలన్నారు.