Went on a trip and got stuck in Nepal. పర్యటనకు వెళ్లి.. నేపాల్‌లో చిక్కుకుని
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:54 PM
Went on a trip and got stuck in Nepal. జిల్లా నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 61 మంది నేపాల్‌లోని ఖాట్మండులో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్‌లో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో మనవారంతా ఆ దేశంలో ఉండడంతో ఇక్కడి బంధువుల్లో టెన్సన్ నెలకొంది.
పర్యటనకు వెళ్లి.. నేపాల్‌లో చిక్కుకుని
జిల్లా నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 61 మంది
వారం రోజుల కిందట పయనం
కల్లోలంగా తయారైన నేపాల్
జిల్లా ప్రజల్లో టెన్సన్
అందరూ క్షేమంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు
రోయల్ కుసుమ్ హోటల్లో వసతి
యాత్రికులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్ అంబేడ్కర్
వారికి మంత్రులు భరోసా
విజయనగరం/కలెక్టరేట్ సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి):
జిల్లా నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 61 మంది నేపాల్‌లోని ఖాట్మండులో చిక్కుకున్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్‌లో నెలకొన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో మనవారంతా ఆ దేశంలో ఉండడంతో ఇక్కడి బంధువుల్లో టెన్సన్ నెలకొంది. అయితే యాత్రికుల వివరాలను జిల్లా అధికారులు సేకరించారు. ప్రస్తుతం అక్కడ క్షేమంగానే ఉన్నారు. వారితో కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రులు లోకేశ్, అనిత, శ్రీనివాస్‌లు మాట్లాడి భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి వెంటనే తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
గత రెండు రోజులుగా నేపాల్‌లోని యువత వీధుల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తోంది. దీంతో అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలు జరగక ముందే జిల్లా నుంచి వారం రోజుల క్రితం మానస సరోవర్ యాత్రకు ట్రైన్‌లో 61 మంది వెళ్లారు. విజయనగరం గాజులరేగకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారంతా ఖాట్మండులోని రోయల్ కుసుమ్ అనే హోటల్లో ఉన్నారు. వారిలో గాజులురేగకు చెందిన గోవింద అనే వ్యక్తితో కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, విజయనగరం తహసీల్దార్ కూర్మనాథ్‌లు ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని ఆడిగి తెలుసుకున్నారు. తాము క్షేమంగా ఉన్నట్లు యాత్రికులు వివరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ, సెర్ప్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా యాత్రికులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఇదిలా ఉంటే జిల్లాలోని అన్ని మండలాల్లో తహసీల్దార్‌ల నుంచి కలెక్టరేట్ అఽధికారులు యాత్రీకల కుటుంబీకుల వివరాలు సేకరించారు. అందరూ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.