Went Fishing… చేపల వేటకు వెళ్లి.. విగతజీవిగా మారి!
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:04 PM
Went Fishing… Returned Lifeless! పాలకొండలో కొండవీధికి చెందిన మత్స్యకారుడు కారింగ్ రమేష్ (42) మంగళవారం గోపాలపురం గ్రామ సమీపంలో ఓనిగెడ్డలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
పాలకొండ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాలకొండలో కొండవీధికి చెందిన మత్స్యకారుడు కారింగ్ రమేష్ (42) మంగళవారం గోపాలపురం గ్రామ సమీపంలో ఓనిగెడ్డలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ ఎప్పటిలానే చేపల వేటకని ఉదయం ఆరు గంటల సమయంలో ఓనిగెడ్డకు వెళ్లాడు. రెండు వలలు గెడ్డలో వేశాడు. ఒక వలలో ఉన్న చేపలను ఒడ్డుకు చేర్చాడు. రెండో వలను తీసేందుకు ప్రయత్నించాడు. అయితే చెత్తా చెదారాలు అడ్డుకోవడంతో వాటిని తొలగించి వల తీసేందుకు తాడు సాయంతో గెడ్డలోకి దిగాడు. అయితే వరద ప్రవాహానికి తాడు పక్కకు జారిపోవడంతో రమేష్ గెడ్డలో కొట్టుకుపోయాడు. అది గమనించిన సహచర మత్స్యకారులు షాక్‌కు గురయ్యారు. వెంటనే రమేష్ కోసం కొద్దిసేపు గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. గంట తర్వాత మళ్లీ ప్రయత్నించగా విగత జీవిగా కనిపించిన రమేష్‌ను ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న రమేష్‌ను చూసి భోరుల విలపించారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామంటూ భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు మిన్నంటాయి. దీనిపై పాలకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.