శభాష్ సిద్ధూ!
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:23 AM
మధ్యతరగతి కుర్రోడు. ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేందుకు అయ్యే ఖర్చును కూడా భరించలేని పరిస్థితి. బస్సు లు, ఆటోల్లో వెళ్తూ సకాలంలో కాలేజీకి చేరుకోలేక పోతున్న ఆ కుర్రాడి మదిలో పుట్టుకొచ్చింది కొత్త ఆవిష్కరణ.
-ఇంటర్ యువకుడి మదిలో సరికొత్త ఆవిష్కరణ
-బ్యాటరీ సైకిల్ మీద రోజూ కళాశాలకు..
-అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
-ప్రోత్సాహకంగా రూ.లక్ష అందజేత
తెర్లాం, జూలై 9(ఆంధ్రజ్యోతి): మధ్యతరగతి కుర్రోడు. ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేందుకు అయ్యే ఖర్చును కూడా భరించలేని పరిస్థితి. బస్సు లు, ఆటోల్లో వెళ్తూ సకాలంలో కాలేజీకి చేరుకోలేక పోతున్న ఆ కుర్రాడి మదిలో పుట్టుకొచ్చింది కొత్త ఆవిష్కరణ. తనకున్న సైకిల్‌కు బ్యాటరీని అమర్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే మార్గానికి శ్రీకారం చుట్టాడు. మూడు నెలలుగా బ్యాటరీ సైకిల్ మీద కళాశాలకు వెళ్తున్న ఆ కుర్రాడు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టిలో పడ్డాడు. పవన్ కల్యాణ్ ఆ కుర్రాడిని అమరావతి రప్పించుకున్నారు. బ్యాటరీ సైకిల్ వెను కూర్చుండబెట్టుకుని స్వయంగా నడిపారు. లక్ష రూపాయుల ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఆ యువకుడే తెర్లాం మండలం పూనువ లస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సింహాచలం. వీరు దినసరి కూలీలు.
తెర్లాం మండలం రాజాపు వలసకు చెందిన సిద్ధు రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కళాశాలకు రానుపోను 40 కిలోమీటర్ల దూరం కావడం.. ఆర్థిక పరిస్థితి అంతంతమా త్రంగా ఉండడంతో ఆటోలు, బస్సుల్లో వెళ్లి వచ్చేందుకు నానా అవస్థలు పడేవాడు. రోజూ రూ.60 నుంచి రూ.70 ఖర్చు అయ్యేది. దీంతో తన తెలివితేటలకు పదునుపెట్టాడు. తల్లిదండ్రులు, బంధుమిత్రుల నుంచి రూ.30 వేలు సేకరించి రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో సైకిల్ మోడిఫికేషన్‌కు సంబంధించిన మెటీరియల్ తెప్పించుకున్నాడు. తన స్నేహితుడి సహకారంతో గతంలో పాఠశాల స్థాయిలో సైన్స్ పరంగా ఉన్న అనుభవాన్ని జోడించి బ్యాటరీ సైకిల్‌కు రూపకల్పన చేశాడు. దీంతో రోజుకు రూ.6 ఖర్చుతో సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణించేం దుకు వీలుగా వాహనాన్ని సిద్ధం చేసుకున్నాడు. మూడు గంటలు చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు నడిచే ఈ వాహనాన్ని చూసిన వారంతా తమకూ ఒకటి తయారు చేయాలంటూ సిద్ధు వెంటపడుతున్నారు.