Well done, Bharat Chandra! శభాష్.. భరత్‌చంద్ర
ABN , Publish Date - May 11 , 2025 | 10:56 PM
Well done, Bharat Chandra! కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్లా భరత్‌చంద్ర తెలంగాణ ఈఏపీసీఈటీలో (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఇంజనీరింగ్ విభాగంలో ప్రతిభ చూపాడు. మొత్తంగా 99.99 శాతం మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు.
ప్రతిభ చూపిన గుణానుపురం విద్యార్థి
జియ్యమ్మవలస, మే11 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్లా భరత్‌చంద్ర తెలంగాణ ఈఏపీసీఈటీలో (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఇంజనీరింగ్ విభాగంలో ప్రతిభ చూపాడు. మొత్తంగా 99.99 శాతం మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. భరత్‌చంద్ర జేఈఈ మెయిన్స్ 2025లో ఆలిండియా 121వ ర్యాంకు, ఆలిండియా ఓబీసీ కోటాలో 17వ ర్యాంకు సాధించాడు. 2013-18 వరకు అనకాపల్లిలోని ఓ స్కూల్‌లో ఒకటి నుంచి 5 వరకు చదివాడు. 2018-23లో కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ఓ స్కూల్‌లో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివాడు. టెన్త్‌లో 575 మార్కులు సాధించాడు. 2023-25 వరకు ఇంటర్మీడియట్ (ఎంపీసీ)ను హైదరాబాద్‌లోని ఓ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో చదివి 961 మార్కులు సాధించాడు. జేఈఈలో మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో చదివిన భరత్‌చంద్ర ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లో ఎంపికైనా వెళ్లలేకపోయాడు.
శ్రీకాకుళంలో నివాసం..
భరత్‌చంద్ర తండ్రి రామకృష్ణ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఉన్న మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గాపనిచేస్తున్నారు. తల్లి దమయంతి శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలంలోని బెలమం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ్ముడు రోహిత్ చంద్ర కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు శ్రీకాకుళం పట్టణం తిలక్‌నగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం భరత్‌చంద్ర హైదరాబాద్‌లో ఉన్నాడు. కాగా మదర్స్‌డే రోజున తన కుమారుడు మంచి బహుమతి ఇచ్చాడని విద్యార్థి తల్లి దమయంతి ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.