వెల్ఫేర్ కార్యదర్శి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:01 AM
ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం పట్టణంలోని కొత్తవలసలో చోటుచేసుకుంది.
జియ్యమ్మవలస, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం పట్టణంలోని కొత్తవలసలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండల కేంద్రానికి చెందిన కడారి నాగభూషణ, ధనలక్ష్మి దంపతులు బంగారు వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. వీరికి రాఘవాచారి(32) అనే కుమారుడు, లావణ్య అనే కుమార్తె ఉన్నారు. రాఘవాచారి పార్వతీపురం మున్సిపాలిటీలో వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తన తోటి ఉద్యోగులతో కలిసి కొత్తవలసలోని ఒక రూములో ఉంటున్నారు. ప్రతి శనివారం తన తల్లిదండ్రుల వద్దకు జియ్యమ్మవలస వచ్చి, తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్తూ ఉంటారు. గత శనివారం రాకపోవడంతో తల్లిదండ్రులు రాఘవాచారికి ఫోన్ చేశారు. కానీ ఎటువంటి సమాధానం లేదు. దీంతో తోటి స్నేహితులకు ఫోన్ చేసి, అడిగారు. వారు మొదట ఒంట్లో బాగులేదని చెప్పారు. తర్వాత తాము లేని సమయంలో పురుగు మందు తాగాడని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెంటనే తమ కుమారుడిని పార్వతీపురంలో సౌజన్య ఆసుపత్రికి, అక్కడ నుంచి విజయనగరంలో తిరుమల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాఘవాచారి అక్కడ చికిత్స పొందుతూనే శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీనిపై పార్వతీపురం పట్టణ ఎస్‌ఐ గోవిందరావును వివరణ కోరగా.. ప్రస్తుతం విజయనగరంలో పోస్టుమార్టం జరుగుతుందని, తర్వాత వారి కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.