Tribal Students గిరిజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:33 PM
Welfare of Tribal Students is the Goal గిరిజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ..5.72 కోట్లతో చేపట్టనున్న అదనపు భవన నిర్మాణాలకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు.
ఆశ్రమ పాఠశాలలో అదనపు భవన నిర్మాణాలకు శంకుస్థాపన
సాలూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ..5.72 కోట్లతో చేపట్టనున్న అదనపు భవన నిర్మాణాలకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘స్వచ్ఛభారత్‌లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన వసతి గృహాల్లో 2,030 మరుగుదొడ్లను నిర్మిస్తున్నాం. రూ.185 కోట్లతో రాష్ట్రంలో 45 ఆశ్రమ పాఠశాలల్లో , జిల్లాలో ఆరు చోట్ల రూ.20 కోట్లతో అదనపు భవన నిర్మాణాలు చేపడతాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశాం. అనారోగ్యంతో బాధపడుతున్న 65 మంది విద్యార్థులను విశాఖ కేజీహెచ్‌లో చేర్పించగా 64 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన ఒక్కరు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతుంటే ఆసుపత్రిలో ఉంచాం. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై శ్రద్ధ చూపిస్తున్నారు. త్వరలోనే దండిగాం రోడ్డు నుంచి కొత్తవలస గ్రామానికి రహదారి నిర్మాణం జరుగుతుంది.’ అని తెలిపారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ‘ముస్తాబు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు రోజూ చేతులు కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనారోగ్యం బారినపడితే ఆకుపసర, నాటు వైద్యం జోలికి పోవద్దని సూచించారు. సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో కనకదుర్గ, డీడీ విజయశాంతి, ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి, సర్పంచ్ ధర్మవతి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.